Andhra Pradesh : ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. ఏపీలో నేడు, రేపు తీవ్ర వడగాల్పులు.. పిడుగులు పడే ఛాన్స్
Heat Waves : మొత్తంగా 5 చోట్ల 44 డిగ్రీలు, 13 ప్రాంతాల్లో 43 డిగ్రీలు, 3 చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. ఏపీలో 35 మండలాల్లో వడగాల్పులు వీచాయి.

Andhra Pradesh
Andhra Pradesh – Heat Waves : ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. మాడుపగిలే ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక, పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. టెంపరేచర్లు 44 డిగ్రీలు
దాటేశాయి.
నిన్న (మే 27) అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నయ్యగూడెంలో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తిరుపతి జిల్లా గూడూరులో 44.6, బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం కావూరు.. ఏలూరు జిల్లా పెదవేగిలో 44.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మొత్తంగా 5 చోట్ల 44 డిగ్రీలు, 13 ప్రాంతాల్లో 43 డిగ్రీలు, 3 చోట్ల 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.
ఓవైపు తీవ్రమైన ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతుంటే మరోవైపు వడగాల్పులు బెంబేలెత్తిస్తున్నాయి. ఏపీలో 35 మండలాల్లో వడగాల్పులు వీచాయి. ఇంకా వడగాల్పుల ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది.
ఇవాళ(మే 28) 73 మండలాల్లో, రేపు(మే 29) 12 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అధికంగా గుంటూరులో 15, తూర్పుగోదావరి జిల్లాలో 11, ఎన్టీఆర్ జిల్లాలో 10 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మిగతా చోట్ల ఎండలు తీవ్ర ప్రభావం చూపనున్నాయని వెల్లడించింది.
మరోవైపు ద్రోణి ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే ఆస్కారం ఉన్నందున వర్షం పడే సమయంలో ఎవరూ చెట్ల కింద ఉండొద్దని అధికారులు హెచ్చరించారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.