Ambati Rayudu : జనసేనలోకి అంబటి రాయుడు..! గుంటూరు పార్లమెంట్ నుంచి బరిలోకి?

పవన్ కల్యాణ్ తో అంబటి రాయుడు భేటీ కావటం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వీరి భేటీలో తాజా రాజకీయాలు, వైసీపీలో ఎందుకు చేరాల్సి వచ్చింది? ఎందుకు మళ్లీ రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలపై పవన్ కు అంబటి వివరించినట్లు తెలుస్తోంది.

Ambati Rayudu : జనసేనలోకి అంబటి రాయుడు..! గుంటూరు పార్లమెంట్ నుంచి బరిలోకి?

Ambati Rayudu and Pawan Kalyan

Updated On : January 10, 2024 / 2:24 PM IST

Ambati Rayudu Meet Pawan Kalyan : టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా ఆయన మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. ఇటీవల వైసీపీలో చేరిన అంబటి రాయుడు.. కొద్దిరోజులకే ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తో అంబటి భేటీ కావటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇరువురి మధ్య భేటీలో తాజా రాజకీయాలు, వైసీపీలో ఎందుకు చేరాల్సి వచ్చింది? ఎందుకు మళ్లీ రాజీనామా చేయాల్సి వచ్చిందనే విషయాలపై పవన్ కు అంబటి వివరించినట్లు తెలుస్తోంది. అయితే, త్వరలోనే అంబటి రాయుడు జనసేనలోకి చేరేందుకు సిద్ధమయ్యారని, ఆ ప్రక్రియలో భాగంగానే పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీలోకి దిగుతారని ప్రచారం జరుగుతుంది.

Also Read : విజయవాడలో అన్నదమ్ముల పోటీ.. తమ్ముడిపై కేశినేని నాని పోటీ చేస్తారా?

అంబటి రాయుడు రాజకీయ రంగప్రవేశంపై అనేక రకాల చర్చలు జరిగాయి. ఆ చర్చలకు ఫుల్ స్టాప్ పెడుతూ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గుంటూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా అంబటి బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ, ఎవరూ ఊహించని విధంగా వైసీపీలో చేరిన కొద్దిరోజులకే అంబటి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ట్విటర్ వేదికగా వైసీపీకి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో అంబటి రాయుడు తెలిపాడు. ‘జనవరి 20 నుంచి దుబాయ్ వేదికగా జరిగే ఐఎల్టీ20లో ముంబై ఇండియన్స్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్రొఫెషనల్ ఆటలో ఆడేందుకు నాకు రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ ఉండకూడదు. అందుకే నేను వైసీపీకి రాజీనామా చేసినట్లు’ పేర్కొన్నాడు. తాజాగా అంబటి జనసేన పార్టీలోకి చేరుతున్నట్లు వార్తలు రావడం, పవన్ కల్యాణ్ తో భేటీ కావడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read : Keshineni Nani : వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా బరిలోకి కేశినేని నాని?

అంబటి రాయుడు వైసీపీని వీడటానికి కారణం.. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం సీటు దక్కకపోవటమేనని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గుంటూరు పార్లమెంట్ సీటును ఇచ్చేందుకు సీఎం జగన్ ఒప్పుకోలేదని, దీంతో రాయుడు వైసీపీని వీడినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో జనసేన నుంచి పిలుపు రావడం, గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు హామీ రావడంతో జనసేనలోకి వెళ్లేందుకు రాయుడు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 2014, 2019లో రెండు దఫాలుగా టీడీపీ అభ్యర్థిగా గల్లా జయదేవ్ విజయం సాధించారు. ఈ దఫా జయదేవ్ పోటీకి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. దీంతో అంబటి రాయుడిని బరిలోకి దింపాలనే ఆలోచనలో టీడీపీ- జనసేన అధినేతలు ఉన్నట్లు సమాచారం. పవన్ తో భేటీ తరువాత రాయుడు రాజకీయ భవిష్యత్‌పై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.