Chalo Vijayawada: ఛలో విజయవాడ.. పోలీసులు అడ్డుకున్నా తగ్గేదే లే అంటున్న ఉద్యోగులు!
పోలీసులు అడ్డుకున్నా రేపు(3 ఫిబ్రవరి 2022) ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించే తీరుతామని స్పష్టం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు.

Employees
Chalo Vijayawada: పోలీసులు అడ్డుకున్నా రేపు(3 ఫిబ్రవరి 2022) ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించే తీరుతామని స్పష్టం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు. ఏపీలో పీఆర్సీ ఉద్యోగులు, ప్రభుత్వానికి మధ్య పోరు తీవ్రతరం అవుతోండగా.. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీతో స్టీరింగ్ కమిటీలో చర్చలు సఫలం కాలేదు. ఈ క్రమంలో ఛలో విజయవాడ కచ్చితంగా నిర్వహిస్తామని ఉద్యోగులు స్పష్టం చేశారు.
భవిష్యత్ కార్యాచరణపై సమావేశమైన స్టీరింగ్ కమిటీ సభ్యులు.. సమావేశం తర్వాత పే స్లిప్పులను తగలబెట్టారు. పీఆర్సీపై ప్రభుత్వ వైఖరిని ఉద్యోగులు తప్పుబడుతూ.. రేపటి ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తోండగా పోలీసులు మాత్రం అనుమతి లేని కార్యక్రమం నిర్వహించడానికి వీల్లేదని చెబుతున్నారు.
ఛలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్పష్టం చేశారు. అటు పోలీసుల తీరును ఉద్యోగ సంఘాల నేతలు తప్పుబడుతున్నారు. జిల్లాల్లో సైతం అడ్డుకుంటే ఎక్కడికక్కడ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఉద్యోగులు. విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా మాత్రం కార్యక్రమానికి మాత్రం అనుమతి లేదని అంటున్నారు.