తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. జగన్ కీలక నిర్ణయం

Andhra Pradesh Cm Permits Relieving Of Telangana Staff
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్న తెలంగాణ క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను రిలీవ్ చేస్తూ జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు విడుదల చేశారు. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కె.వెంకట్రావిురెడ్డి ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు.
తమను సొంతరాష్ట్రంలో ఉద్యోగ కార్యకలాపాలు నిర్వహించేందుకు గాను రిలీవ్ ఇవ్వాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం వారిని రిలీవ్ చేసేందుకు అంగీకరించారు. మొత్తం 711 మంది ఉద్యోగులను తెలంగాణకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను జగన్ ఆదేశించారు.
జగన్ మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం ఉద్యోగులు మాట్లాడుతూ.. సీఎం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషం కలిగించిందని తెలిపారు. కుటుంబాలు తెలంగాణలో.. మేము ఆంధ్రాలో పనిచేస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డామని.. ఇకపై సొంతరాష్ట్రంలో కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా ఉంటామని వెల్లడించారు. సీఎం వైఎస్ జగన్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు.