AP Rains : రెయిన్ అలర్ట్.. ఏపీకి తుపాను గండం.. ఆ రెండ్రోజులు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు.. ప్రజలకు వాతావరణ శాఖ కీలక సూచనలు
నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.

AP Rains
AP Rains : ఏపీలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే, రాబోయే నాలుగు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ విభాగం (ఐఎండీ) తెలిపింది. అరేబియా సముద్రంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి బలపడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో తీవ్ర వాయుగుండంగా, ఆ తరువాత తుపానుగా మారే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ అంచనా వేసింది.
అరేబియా సముద్రంలో అల్పపీడనం బలపడి తుపానుగా మారితే దీని ప్రభావంతో దేశంలోని గుజరాత్, గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వచ్చే ఆరు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మరోవైపు.. ఈనెల 27 నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆ కారణంగా ఈనెల 26, 27 తేదీల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు రానున్న నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు సూచించారు. పలు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులుకు, ప్రజలకు హెచ్చరించారు. పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు.
శుక్రవారం పార్వతీపురం, ఏలూరు, ఎన్డీఆర్, పార్వతీపురం, కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతాయని, మిగతా జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శనివారం తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, నెల్లూరు, సత్యసాయి, తిరుపతి, చిత్తూరు జిలకలాల్లోనూ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
మరోవైపు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. రాబోయే రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. మాల్దీవులు, కొమొరిన్, లక్షద్వీప్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో మరింత మందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని ఐఎండీ తెలిపింది.