AP Cabinet : ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం, తెలంగాణ తీరుపై ప్రధానికి లేఖ
తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం విషయంలో తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ కేబినెట్ సీరియస్ అయ్యింది. తెలంగాణ మంత్రుల చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని మంత్రివర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.

Ap Cabinet
AP Cabinet Key Decision : తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదం విషయంలో తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఏపీ కేబినెట్ సీరియస్ అయ్యింది. తెలంగాణ మంత్రుల చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని మంత్రివర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలకు సంబంధించి చర్చ జరిగింది. రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలని మంత్రులు అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది.
నీటి విషయంలో ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు ముఖ్యమంత్రి జగన్ సూచన చేశారు. తెలంగాణ రాష్ట్రం అక్రమంగా నీటిని వినియోగిస్తోందన్న మంత్రివర్గం.. తెలంగాణ తీరుపై ప్రధానికి లేఖ రాయాలని కూడా నిర్ణయం తీసుకుంది. నీటి వివాదంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి సంబంధించి ప్రధానంగా మంత్రివర్గం సీరియస్ అయ్యింది. తెలంగాణ మంత్రులు ఎక్కువగా మాట్లాడుతున్నారని కేబినెట్ సమావేశంలో మంత్రులు తమ అభిప్రాయాలను సీఎం జగన్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది.
ఏపీ క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణతో నీటి వివాదాల నేపథ్యంలో ఆయన స్పందించారు. తెలంగాణలో ఏపీ వాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారని, తానేదైనా గట్టిగా మాట్లాడితే వారిని ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయని, అందుకే తాను ఎక్కువగా మాట్లాడడం లేదని జగన్ వివరణ ఇచ్చారు. తెలంగాణ విద్యుదుత్పత్తి అంశంపై మరో లేఖ రాయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అనుమతి లేని జలాల వాడకంపై కేఆర్ఎంబీకి లేఖ రాయాలని స్పష్టం చేశారు. జల వివాదాలపై ప్రధానికి కూడా లేఖ రాయాలని నిర్ణయించారు.
“తెలంగాణలో ఏపీ ప్రజలు ఉన్నారని ఆలోచిస్తున్నా. అందుకే నేను సంయమనం పాటిస్తున్నా. కానీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి? తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు” అంటూ సీఎం జగన్ తీవ్ర స్వరంతో స్పందించినట్టు తెలుస్తోంది. జల వివాదాల అంశంలో ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు.