ముహూర్తం ఖరారు : ఏపీ కేబినెట్ మీటింగ్

రాజధాని మార్పుపై ఏపీ కేబినెట్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. 2020, జనవరి 20వ తేదీన మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని అంశమే ప్రధాన అజెండాగా సాగే ఈ సమావేశంలో… హైపవర్ కమిటీ నివేదికకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఆ వెంటనే అసెంబ్లీ ముందుకు దాన్ని తీసుకొచ్చి లాంఛనాన్ని పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదనకే మొగ్గు చూపుతున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. సాధ్యమైనంత వేగంగా రాజధానిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. 20వ తేదీ ఉదయం తొమ్మిదిన్నరకు మంత్రులు సమావేశమవుతారు. హైపవర్ కమిటీ ఈనెల 20లోపే నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదికపై మంత్రివర్గం చర్చించి ఆమోదం తెలిపే అవకాశముంది. ఆ తర్వాత 11గంటలకు రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగుతుంది.
* ఈనెల 20న ఏపీ కేబినెట్ సమావేశం
* ఉ.9.30ని.లకు సెక్రటేరియట్‌లో మంత్రివర్గం మీటింగ్
* కేబినెట్ సమావేశంలో నివేదికను అందించనున్న హైపవర్ కమిటి
* జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను అధ్యయనం చేస్తున్న హైపవర్ కమిటి
* ఈనెల 17న సా.5గం.ల వరకు అభిప్రాయాలు చెప్పేందుకు రాజధాని రైతులకు గడువు
* ఈనెల 20న ఉ. 10గం.లకు అసెంబ్లీ సమావేశం
* కీలక బిల్లులను సభలో ప్రవేశ పెట్టనున్న జగన్ సర్కార్
ఈ ప్రత్యేక సమావేశాల్లో రాజధాని, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి GN RAO, BCG నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెడుతుంది. హైపవర్ కమిటీ నివేదికను కూడా సభ ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. పరిస్థితులను బట్టి అవసరమైతే 21న కూడా అసెంబ్లీ సమావేశాన్ని కొనసాగించే అవకాశం ఉంది. అయితే శాసనమండలి మాత్రం ఒక్కరోజుతోనే ముగిస్తారు. కేబినెట్ సమావేశం 18నే జరుగుతుందని ప్రచారం జరిగినా చివరకు 20వ తేదీనే ఖాయం చేసింది ప్రభుత్వం.
హైపవర్ కమిటి ఇప్పటికే మూడుసార్లు సమావేశమైంది. రాజధాని తరలింపు, ఉద్యోగులు, రైతు సమస్యల వంటి పలు అంశాలపై చర్చించింది. ఆ కమిటి కూడా మూడు రాజధానులకు అనుకూలంగానే నివేదిక ఇవ్వడం లాంఛనమే అని చెప్పాలి. అయితే అమరావతి రైతులు గత కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. దీంతో వీరిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. రాజధాని తరలింపు దాదాపు ఖాయమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి రైతులకు ఊరట కలిగించే నిర్ణయాలను సభలో ప్రకటించొచ్చన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.