Chandrababu Davos Tour : దావోస్‌లో ఏపీ ప్రభుత్వం రికార్డు ఒప్పందాలు..! రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్న బడా సంస్థ
Chandrababu Davos Tour : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ బృందం దావోస్ పర్యటన కొనసాగుతోంది. భారీ ఎత్తున పెట్టుబడులే లక్ష్యంగా వీరి టూర్ విజయవంతం కొనసాగుతోంది.
Chandrababu Davos Tour
- దావోస్‌లో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు బృందం పర్యటన.
- దావోస్‌లో ఏపీ ప్రభుత్వం రికార్డు ఒప్పందాలు.
- రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టనున్న RMZ సంస్థ..!
Chandrababu Davos Tour : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ బృందం దావోస్ పర్యటన కొనసాగుతోంది. భారీ ఎత్తున పెట్టుబడులే లక్ష్యంగా వీరి టూర్ విజయవంతం కొనసాగుతోంది. వివిధ దేశాల్లో రంగాల వారీగా అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలను అధ్యయనం చేస్తోన్న చంద్రబాబు బృందం .. రాష్ట్రంలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, తెచ్చిన పాలసీలను పారిశ్రామిక వేత్తలకు వివరిస్తోంది. మరోవైపు ఏపీలో వివిధ సంస్థలు ఇప్పటికే మొదలుపెట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించేలా పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సంప్రదింపులు జరుపుతున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు మూడో రోజూ (బుధవారం) కీలక సమావేశాల్లో పాల్గోనున్నారు. ప్రముఖ కంపెనీల సీఈవోలతో భేటీ కానున్నారు.
దావోస్‌లో వివిధ జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులతో చంద్రబాబు బృందం వరుస భేటీలు నిర్వహిస్తోంది. ఏపీలో అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలను తెలుసుకునేందుకు పలువురు పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరిచారు. పెట్టుబడుల సాధన, ఏపీ బ్రాండింగ్, రాష్ట్రంలోని వనరులను వివరించేలా ప్రపంచ ఆర్థిక సదస్సుకు టీమ్ ఏపీ హాజరైంది. గూగుల్ ఏఐ డేటా సెంటర్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ వంటి పెట్టుబడులతో విశాఖ, కాకినాడ ప్రపంచ ఆర్థిక సదస్సులో చర్చనీయాంశంగా మారింది. 1998 నుంచి చంద్రబాబు దావోస్ కు వస్తున్న విషయాన్ని పలువురు పారిశ్రామిక వేత్తలు ప్రస్తావించారు.
వివిధ రంగాల్లోని 20 ప్రాజెక్టుల ద్వారా సుమారు రూ. 2.36 లక్షల కోట్ల పెట్టుబడులను గతేడాది కూటమి ప్రభుత్వం రాబట్టింది. ఐటీ రంగంలో దాదాపు రూ. 1.36 లక్షల కోట్లు, స్టీల్ రంగంలో సుమారు రూ. 62 వేల కోట్లు, ఇంధన రంగంలో దాదాపు రూ. 23 వేల కోట్లు, ఎలక్ట్రానిక్స్ రంగంలో సుమారు రూ. 9 వేల కోట్లు, డిఫెన్స్-ఎయిరో స్పేస్ రంగంలో 2 వేల కోట్లు, ఇన్ఫ్రా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ. 4 వేల కోట్లు పెట్టుబడులు సాధించింది. అయితే, ఏపీలో వివిధ సంస్థలు ఇప్పటికే మొదలుపెట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించేలా పలువురు పారిశ్రామిక వేత్తలతో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సంప్రదింపులు జరిపారు.
గూగుల్, ఐబీఎం వంటి కీలక సంస్థలకు చెందిన ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. అమరావతిలో క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఐబీఎం వద్ద చంద్రబాబు ప్రతిపాదించారు. ఐబీఎం భాగస్వామ్యంతో అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేసేలా ఇప్పటికే ఏపీ ఒప్పందం చేసుకుంది. ఏపీలో 10 లక్షల మందికి ఏఐ, క్వాంటం, సైబర్ సెక్యూరిటీపై నైపుణ్య శిక్షణ ఇవ్వాలని ఐబీఎం ప్రతినిధులను చంద్రబాబు కోరారు.
దావోస్‌లో ఏపీ ప్రభుత్వం రికార్డు ఒప్పందాలు చేసుకుంటుంది. ఏపీలో పర్యటించేందుకు, పరిశ్రమలు స్థాపించేందుకు మరికొన్ని అంతర్జాతీయ సంస్థల ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేలా ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రతినిధులతో లోకేష్ సంప్రదింపులు జరిపారు. పెట్టుబడులు పెట్టేందుకు ఆర్ఎంజెడ్ గ్రూప్ అంగీకరించింది. విశాఖ, రాయలసీమ ప్రాంతాల్లో ఆర్ఎంజెడ్ గ్రూప్ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. జీసీసీలు, హైపర్ స్కేల్ డేటా సెంటర్, ఇండస్ట్రీయల్, లాజిస్టిక్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ఆర్ఎంజెడ్ సంస్థ సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది.
మూడోరోజు (బుధవారం) కీలక సమావేశాల్లో చంద్రబాబు బృందం పాల్గోనుంది. ప్రముఖ కంపెనీల సీఈవోలతో ముఖాముఖీ భేటీ కానున్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం కాంగ్రెస్ లో పారిశ్రామిక పురోగతిపై నిర్వహించే సెషన్లో పాల్గొంటారు. హురైసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్ తో సమావేశం అవుతారు. అదేవిధంగా తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి శిబులాల్, ఆ సంస్థ సీవోవో ఖష్బూ అవస్థి, కాలిబో ఏఐ అకాడమీ సీఈవో రాజ్ వట్టికుట్టి సీఎం చంద్రబాబుతో సమావేశమై చర్చిస్తారు. అదేవిధంగా చంద్రబాబు బృందం పలు అంశాలపై జరిగే చర్చల్లో పాల్గోనుంది.
