మోడీతో కలిసి మూన్ లాండింగ్ చూడనున్న ఆంధ్ర విద్యార్థిని

మోడీతో కలిసి మూన్ లాండింగ్ చూడనున్న ఆంధ్ర విద్యార్థిని

Updated On : September 2, 2019 / 4:28 AM IST

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థిని బంపర్ ఆఫర్ కొట్టేసింది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి మూన్ లాండింగ్ చూసే అవకాశాన్ని దక్కించుకుంది. ప్రగాడ కాంచన బాలశ్రీ వాసవీ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. ఇస్రో ప్రయోగమైన చంద్రయాన్ 2 మూన్ లాండింగ్‌ను క్విజ్ విజేతతో కలిసి ప్రధాని మోడీ వీక్షిస్తారని ముందుగానే ప్రకటించారు. 

సెప్టెంబర్ 7వ తేదీ బెంగళూరులోని ఇస్రో సెంటర్లో నుంచి మోడీతో కలిసి వీక్షించనుంది బాలిక. శ్రీకాకుళంలోని పోలంకి మండలంలో ఏడులవలస గ్రామంలో వాసవీ చదువుకుంటోంది. స్వాత్రంత్ర్య దినోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో అంతరిక్షం అనే అంశంపై వ్యాసం రాసింది. అందులో గెలుపొందడంతో పాఠశాల ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని కల్పించారు. 

8వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకూ క్విజ్ లో పాల్గొన్నారు. 10నిమిషాల పాటు జరిగిన ఈ ప్రోగ్రాంలో అంతరిక్షం గురించి పలు ప్రశ్నలు అడిగారు. ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొన్న వారిలో వాసవీ ఒక్కరే విజేతగా నిలిచింది. తండ్రి చనిపోయినప్పటికీ వాసవీ పట్టుదలతో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటోంది. 

ఇంజనీర్ కావడమనేది తన కల అని చెప్తోంది వాసవీ. బెంగళూరుకు ఫ్లైట్‍‌లో రమ్మని వాసవీకి ఆఫర్ చేసిందట ఇస్రో. ట్రైన్‌లోనే వస్తానని చెప్పడంతో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు సెకండ్ ఏసీ టిక్కెట్ చేశారు. శ్రీకాకుళం నుంచి బెంగళూరుకు సెప్టెంబర్ 5న చేరుకుని సెప్టెంబరు 7న ప్రధానితో కలిసి చంద్రాయన్ 2 మూన్ లాండింగ్‌ను వీక్షించనుంది వాసవీ.