ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా..? చెయ్యని వారికి అలర్ట్..
కూటమి ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది. అయితే.. మొదటి విడత గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకోని వారికి ప్రభుత్వం తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది.

Free Gas Cylinder Scheme
Free Gas Cylinder: ఏపీలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్కో హామీని అమలు చేస్తుంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాన్ని దీపావళి కానుకగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం అందించనుంది. అయితే, ప్రస్తుతం చాలా మంది మొదటి విడత గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకున్నారు. ఇంకా కొంత మంది తొలి విడత గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోలేదు. ఈ క్రమంలో ప్రభుత్వంకీలక ప్రకటన చేసింది.
కూటమి ప్రభుత్వం సూపర్-6 హామీల్లో ఒకటిగా అమలవుతున్న దీపం-2 పథకం కింద లబ్ధిదారులు మార్చి 31లోపు ఎప్పుడైనా ఉచిత సిలిండర్ ను బుక్ చేసుకొని పొందవచ్చునని ఏపీటీఎస్ చైర్మన్ మోహనకృష్ణ తెలిపారు. మొత్తం 1.55కోట్ల లబ్ధిదారుల్లో ఇప్పటి వరకు 91,36,235 మంది సిలిండర్లు బుక్ చేసుకున్నట్లు ఆయన తెలిపారు. 86,60,522 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.687.38 కోట్ల సబ్సిడీ మొత్తం జమ అయినట్లు వివరించారు. ప్రభుత్వం రూ. 691.54కోట్లను సబ్సిడీ కోసం విడుదల చేయడం జరిగిందని తెలిపారు.