Tirupati Rain : తిరుప‌తిలో మళ్లీ భారీ వ‌ర్షం..పలు కాల‌నీలు జ‌ల‌దిగ్బంధం

తిరుప‌తిలో మళ్లీ భారీ వ‌ర్షం కురిసింది. ఇప్పటికే కురుస్తున్న వర్షాలతో నానా పాట్లు పడుతున్న ప్రజలకు మరోసారి ఉపద్రవంలా ముంచెత్తింది వర్షం. పలు కాల‌నీలు జ‌ల‌దిగ్బంధంలో చిక్కుకున్నాయి.

Tirupati Rain : తిరుప‌తిలో మళ్లీ భారీ వ‌ర్షం..పలు కాల‌నీలు జ‌ల‌దిగ్బంధం

Tirupati Rain

Updated On : November 24, 2021 / 2:41 PM IST

Heavy rain again in tirupati city : తిరుపతి నగరంపై వరుణుడు పగబట్టాడా? అన్నట్లుగా ఉంది అక్కడ కురుస్తున్న వర్షాలు చూసుంటే. వాయుగుండ ప్రభావంతో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుపతి నగరం విలవిల్లాడిపోయింది. వర్షాలు కాస్త శాంతించాయి అనుకుంటే మరోసారి విరుచుకుపడ్డాడు వరుణుడు. తిరుపతిలో మరోసారి భారీ వర్షాలు కురవటంతో పలు కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. రోడ్లు కాలువల్లా మారాయి. కాలనీలు కుంటలను తలపిస్తున్నాయి.

తిరుపతి నగరంలో ఎక్కడ చూసినా వరదే. రెండు రోజులుగా వరద నీటిలోనే మగ్గుతున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలు. తిండి లేదు. తాగటానికి నీరు లేదు. వరద నీటితో తిరుపతి అతలాకుతలమైపోతోంది. ఏడు కొండలపై కురుస్తున్న వర్షపు నీరు కొండ పైనుంచి వచ్చిన వరద ప్రవాహం తిరుపతిని ముంచేసింది. వాన దెబ్బ..వరద నీటి ఉదృతికి తిరుపతి నగరం చిగురుటాకులా వణికిపోతొంది. ఇప్పటికీ నలువైపులనుంచి వరద నీరు వచ్చిపడుతునే ఉంది. మోకాలి లోతు నీటిలో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు.కాలువులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి కాలు జారిందా ఇక గల్లంతే.

Read more : MLC Elections : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోర్జరీ వివాదం

తిరుపతి పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లన్నీ మునిగాయి. శ్రీపద్మావతి యూనివర్శిటీ ఇంజినీరింగ్‌ కళాశాలలోకి వరద చేరింది. రైల్వే అండర్‌బ్రిడ్జిల వద్ద భారీగా నీరు చేరడంతో మూసేసి ట్రాఫిక్‌ మళ్లించారు. ముంపు కాలనీల్లో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరి వస్తువులు నీటిలో పడవల్లా తేలియాడుతున్నాయి.

తాగడానికి నీరు, తినడానికి తిండి లేక ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇటు స్వర్ణముఖి నది నీటి ప్రవాహం పెరగడంతో రైల్వే లైన్ దెబ్బతింది. రేణిగుంట – చెన్నై రైల్వే లైన్ తొమ్మిది గoడ్ల వారధి దగ్గర నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో రేణిగుంట రైల్వే స్టేషన్ మీదుగా వెళ్ళవలసిన పలు రైళ్లను, వయా గూడూరు మీదుగా తరలించారు. భారీ వర్షానికి గ్రామాల మధ్య రోడ్లు తెగిపోయాయి. దీంతో తిరుపతి రూరల్‌ నుంచి అర్బన్‌కు రాకపోకలు నిలిచిపోయాయి.