వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం : హోంమంత్రి అనిత
విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి.

Vangalapudi Anitha
Vangalapudi Anitha: విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఏడుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటిన తరువాత భారీ వర్షం కురిసింది. దీంతో సిమెంట్ గోడ కూలి ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. సింహాచలం ప్రమాద ఘటనను తెలుసుకొని ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.25లక్షలు, గాయపడిన వారికి రూ. 3లక్షల చొప్పున పరిహార ప్రకటించింది.
ఈ ప్రమాద ఘటనపై హోం మంత్రి అనిత మాట్లాడారు. మృతిచెందిన కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.25లక్షలు పరిహారం అందిస్తామని చెప్పారు. వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అన్నారు. వెంటనే పరిహారం అందిస్తామని, ఈ ఘటనను రాజకీయం చేయొద్దని, చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అనిత తెలిపారు. జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్రీమెన్ కమిటీ వేశారని, నివేదిక వచ్చే సరికి రెండురోజులు సమయం పడుతుందని అన్నారు. నివేదిక వచ్చిన తరువాత నిర్ణయం తీసుకుంటామని, ఎవరైనా తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని అన్నారు. చనిపోయిన వారు ఏ పార్టీ అయినా పరిహారం అందిస్తామని, చావులకు పార్టీలు ముడిపెట్టొద్దని అనిత కోరారు.
మృతుల వివరాలు..
పత్తి దుర్గాస్వామి నాయుడు (32), మాచవరం, తూర్పుగోదావరి జిల్లా
ఎడ్ల వెంకటరావు (48) అడవివరం, విశాఖపట్నం
కుమ్మపట్ల మణికంఠ (28), మాచవరం, తూర్పుగోదావరి జిల్లా
గుజ్జరి మహాలక్ష్మి (65), హెబీ కాలనీ, వెంకోజీ పాలెం, విశాఖపట్నం
పైలా వెంకటరత్నం (45), ఉమానగర్, వెంకోజీ పాలెం, విశాఖపట్నం
పిళ్లా ఉమామహేశ్ (30), చంద్రంపాలెం, మధురవాడ, విశాఖపట్నం
పిళ్లా శైలజ (26) చంద్రంపాలెం, మధురవాడ, విశాఖపట్నం