ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం..

ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం..

YSRCP MP Mithun Reddy

Updated On : July 18, 2025 / 1:46 PM IST

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ పీవీ మిథున్ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మద్యం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. మిథున్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టుతోపాటు సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేయడంతో ఆయన అరెస్టుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. అరెస్ట్ వారెంట్ కోరుతూ విజయవాడ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ వేశారు. మిథున్ రెడ్డి ఎంపీ కావడంతో ఆయన తలదాచుకున్న ప్రాంతాల్లో సోదాలు, అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు చట్టప్రకారం ముందుకెళ్తున్నారు.

ఏపీ మద్యం స్కాం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏ4 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును మిథన్ రెడ్డి ఆశ్రయించాడు. ఆయన ముందస్తు బెయిల్‌ను హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేకపోయినా రాజకీయ కక్షలో భాగంగా తనను అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో మిధున్ రెడ్డి పేర్కొన్నారు. పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ జెబి పార్థివలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం ముందు మిథున్ రెడ్డి తరపున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

ఇప్పటికే సిట్ అధికారులు మిథున్ రెడ్డిపై లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేసిన నేపథ్యంలో విదేశాలకు పారిపోకుండా అడ్డుకునేందుకు ఈ లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సిట్‌ అధికారులు మిథున్ రెడ్డిని అరెస్టు చేసే అవకాశముంది. ఆ మేరకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు.