పవన్‌ను అంతా షకీల సాబ్‌ అనుకుంటున్నారు : జనసేనానికి కొడాలి నాని కౌంటర్‌

పవన్‌ను అంతా షకీల సాబ్‌ అనుకుంటున్నారు : జనసేనానికి కొడాలి నాని కౌంటర్‌

Updated On : December 29, 2020 / 2:41 PM IST

ap minister Kodali Nani counter to Pawan kalyan’s comments : జగన్ సర్కార్ కు వకీల్ సాబ్ వార్నింగ్ ఇవ్వడం ఏపీలో కాకరేపుతోంది. రైతులకు పంటనష్ట పరిహారం వెంటనే చెల్లించకపోతే వచ్చే సమావేశాల్లో అసెంబ్లీని ముట్టడిస్తానని జనసేనాని హెచ్చరించారు. విశాఖ, అమరావతి, పులివెందుల… ఎక్కడ సమావేశాలు నిర్వహించినా సై అంటూ సవాల్ విసిరారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీ అసలు ఒక్క ఎమ్మెల్యే అయినా ఉన్నాడో లేడో తెలియని జనసేనను చూసి భయపడుతోందని అన్నారు. శతకోటి నానీల్లో ఒకరైన నానిగారికి చెబుతున్నా మీ సీఎం సాబ్ జగన్ రెడ్డికి చెప్పండి రైతులను ఆదుకోవాలని అంటూ మంత్రులను ఉద్దేశించి వ్యక్తిగత విమర్శలు చేశారు.

కౌంటర్‌గా మంత్రి కొడాలి నాని రంగంలోకి దిగారు. మంత్రి కొడాలి నాని తన స్టైల్లో పవన్ కల్యాణ్ పై చెడుగుడు ఆడేశారు. వకీల్ సాబ్ ప్యాకేజీ స్టార్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. రైతులకు పరిహారం ఇవ్వకుంటే అసెంబ్లీని ముట్టడిస్తామన్న జనసేనాని వ్యాఖ్యలకూ కొడాలినాని కౌంటర్‌ ఇచ్చారు. పవన్‌లాంటి వ్యక్తులు ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇస్తే ఎవరూ చూస్తూ కూర్చోబోరన్నారు. అసలు అసెంబ్లీకి నువ్వు ఎలా వస్తావో చూస్తామని హెచ్చరించారు. పవన్‌ కళ్యాణ్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని ఫైర్‌ అయ్యారు. తనను బోడి లింగాలతో పోల్చిన పవన్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బోడి లింగం ఎవరో, శివలింగం ఎవరో… గాజువాక, భీమవరం ప్రజలను అడిగితే చెప్తారన్నారు.

రైతులకు 35వేల పరిహారం ఇవ్వాలని.. వకీల్‌ సాబ్‌ మాటగా… సీఎం జగన్‌కు చెప్పాలన్న పవన్‌ వ్యాఖ్యలకు కొడాలి నాని కౌంటర్‌ ఇచ్చారు. వకీల్‌సాబని మీరనుకుంటే.. రాష్ట్ర ప్రజలు మాత్రం షకీల సాబ్‌ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్యాకేజీ కోసం వచ్చే వారిని తాము పట్టించుకోమన్నారు.
సినిమాలు మానేసి… పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి వస్తానన్న పవన్‌ వ్యాఖ్యలపైనా కొడాలి స్పందించారు. పవన్‌ను సినిమాలు మానుకోవాలని ఎవరు అడిగారని ప్రశ్నించారు. ఆయన సినిమాలు చేసినా, చేయకపోయినా తమకు వచ్చే నష్టమేమీలేదన్నారు కొడాలి నాని.

తాను ఎవరికీ భయపడబోనన్న జనసేనాని వ్యాఖ్యలకు మంత్రి నాని ధీటుగా జవాబు ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌కు కూడా ఎవరు భయపడబోరని స్పష్టం చేశారు. పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని.. నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన పవన్‌ను హెచ్చరించారు.