Atchannaidu: 33 ప్రశ్నలు అడిగారు.. త్వరలోనే బయటపెడతాం: అచ్చెన్నాయుడు
చంద్రబాబు నాయుడి ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన భద్రతపై చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ జైల్లోనే..

Atchannaidu
Atchannaidu – Chandrababu Arrest: ఎవరిమీదైనా కేసు పెట్టాలంటే కనీసం చిన్న ఆధారమైనా ఉండాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై పెట్టిన కేసులో ప్రాథమిక ఆధారాలు కూడా లేవని, అయినా అరెస్ట్ చేశారని మండిపడ్డారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబును ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణితో పాటు అచ్చెన్నాయుడు కలిశారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి 16 రోజులైనప్పటికీ కేసులో చిన్న ఆధారం కూడా చూపించలేదని చెప్పారు.
వైసీపీ ప్రభుత్వం వాస్తవాలు చెప్పడం లేదని అచ్చెన్నాయుడు అన్నారు. కొన్ని విషయాలను మాత్రమే బయటపెడుతోందని అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీంపై చంద్రబాబును ఎటువంటి ప్రశ్నలూ అడగలేదని, సంబంధంలేని పనికిమాలిన ప్రశ్నలను సీఐడీ అధికారులు అడిగారని చెప్పారు.
చంద్రబాబును అడిగిన 33 ప్రశ్నల గురించి తెలుసుకున్నామని, వాటి గురించి పూర్తి వివరాలు త్వరలోనే బయటపెడతామని తెలిపారు. రూ.300 కోట్లు అవినీతి చేశారన్న ఆరోపణలతో 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని జైల్లో పెట్టడం దారుణమని చెప్పారు.
చంద్రబాబు నాయుడి ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన భద్రతపై చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. ఈ జైల్లోనే డెంగీతో ఒక ఖైదీ మృతి చెందాడని గుర్తుచేశారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వచ్చేవారం నుంచి మళ్లీ ప్రారంభమవుతుందని చెప్పారు. ఏపీలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తమ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.