Balakrishna: బాలయ్య కామెంట్స్‌పై కూటమిలో గుసగుసలు.. వైసీపీ క్యాడర్‌కు స్వీట్‌ న్యూస్‌

చిరంజీవి కామెంట్స్‌ను వైసీపీ అస్త్రంగా మల్చుకుని బాలయ్యపై అటాక్ చేస్తోంది. ఏకంగా అఖండ సినిమా కోసం బాలకృష్ణ తనకు స్వయంగా ఫోన్ చేశారని అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని పాత విషయాలను తోడారు.

Balakrishna: బాలయ్య కామెంట్స్‌పై కూటమిలో గుసగుసలు.. వైసీపీ క్యాడర్‌కు స్వీట్‌ న్యూస్‌

Updated On : September 26, 2025 / 9:06 PM IST

Balakrishna: టాలీవుడ్‌ కేరాఫ్‌ కాంట్రవర్సీ. ఎప్పుడూ ఏదో ఒక రచ్చ కామన్ అయిపోయింది. సినీ ఇండస్ట్రీలో బిగ్ స్టార్స్‌ మధ్య కోల్డ్ వార్‌ ఇప్పటిది కాదు. అయితే ప్రభుత్వాలను మధ్యలో పెట్టి లీడర్లు డైలాగులు పేలుస్తుండటమే సెన్సేషన్ అవుతోంది. ఇష్యూ ఏదైనా..సమస్య మరేదైనా ఇండస్ట్రీ ఎప్పుడూ రెండు వర్గాలుగానే కనిపిస్తోంది. పైకి తామంతా బానే ఉన్నామని చెప్తున్నా..ఆయనకు ప్రయారిటీకి ఇస్తే ఈయనకు నచ్చదు..ఇంకో హీరోకు ప్రాధాన్యత ఇస్తే మరో బిగ్ స్టార్‌కు గిట్టదు.

ఇలా పలుసార్లు ఇగో క్లాషెస్‌ బయటికి వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా బాలయ్య ఏపీ అసెంబ్లీలో చేసిన కామెంట్స్‌తో మరో అలాంటి దుమారమే లేచింది. దానికి చిరంజీవి ఇచ్చిన రియాక్షన్‌ ఇంకా హాట్ టాపిక్‌ అయింది. జగన్‌ను, వైసీపీని కార్నర్‌ చేయబోయి బాలయ్య కూటమిని, ప్రత్యేకంగా పవన్‌ కల్యాణ్‌ను ఇబ్బందిలో పడేశారన్న టాక్ వినిపిస్తోంది. (Balakrishna)

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు సినీ పెద్దలను అవమానించారంటూ ప్రస్తావించారు. చిరంజీవి గట్టిగా నిలదీయడంతో జగన్‌ పిలిచి మాట్లాడారని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో సభలో ఉన్న బాలయ్య అనూహ్యంగా అఖండ సినిమా లెవల్‌లో రియాక్ట్ అవడం సంచలనం అయింది. జగన్‌ను టార్గెట్‌ చేస్తూనే చిరంజీవిపై కూడా సెటైరికల్‌గా కామెంట్స్ చేశారు బాలయ్య.

Also Read: ఏలూరు టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠం ఎవరికి? వీరిలో సీఎం చంద్రబాబు ఆశీస్సులు ఎవరికి?

జగన్ మీద విమర్శగా చేస్తున్నారనుకుంటే విషయం కాస్త చిరంజీవి మీదకు ట్విస్ట్ చేయడంతో సీన్ ఓవర్‌ టు కాంట్రవర్సీగా టర్న్ అయ్యింది. చిరంజీవి గట్టిగా మాట్లాడింది లేదు..ఎవరో గట్టిగా మాట్లాడారట..ఇంకెవరో ఇచ్చారట అంటూ వెటకారం జోడించారు బాలయ్య. దీంతో ఆయన గురి ఎవరి మీద అన్నదే అంతా చర్చించుకుంటున్నారు. పైగా ఏపీలో ఫిల్మ్ డెవలప్మెంట్‌కు సంబంధించిన ఇన్విటేషన్‌లో సినీ ప్రముఖుల జాబితాలో బాలయ్య పేరు తొమ్మిదిగా ఉందట. అది కూడా అఖండ ఆగ్రహానికి కారణమైందంటున్నారు. అన్నీ కలగలిపి వయా జగన్‌ మీదుగా చిరు మీద బాలయ్య బాణాలు ఎక్కుపెట్టినట్లు అయింది.

బాలకృష్ణ కామెంట్స్‌తో కూటమికి, మరీ ముఖ్యంగా జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ రెస్పాండ్ కావాల్సిన సిచ్యువేషన్‌ క్రియేట్‌ చేశాయన్న టాక్ వినిపిస్తోంది. సినీ ప్రముఖులు కలవడానికి వెళ్లినప్పుడు జగన్ సీఎం హోదాలో వారిని అవమానించారని నాలుగేళ్ళుగా ఓ చర్చ నడుస్తోంది. ఈ అంశాన్ని అప్పుడు అపోజిషన్‌లో ఉన్న కూటమి విపరీతంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. సినీ పెద్దగా ఉన్న మెగాస్టార్‌ పట్ల జగన్ అమర్యాదగా బిహేవ్ చేశారని కూటమి నేతలే కాదు..పవన్ కల్యాణ్ అయితే ఎన్నో వేదికల మీద, తన పార్టీ మీటింగులలోనూ వాయిస్ రేజ్ చేశారు.

అప్పుట్లో పవన్ పెద్దఎత్తున ఆరోపణలు

అత్యున్నత స్థాయిలో ఉన్న తన అన్నగారిని జగన్ రెండు చేతులు జోడించి దండం పెట్టించుకునేలా చేశారని పవన్ అప్పుడు పెద్దఎత్తున ఆరోపణలు చేశారు. పవనే కాదు పలువురు సినీ ప్రముఖలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. జగన్‌ సినీ ప్రముఖులను, చిరంజీవి అవమానించలేదని ఆనాడే వైసీపీ నేతలు సమాధానం చెప్పుకున్నా..కూటమి నేతలు చేసిన ప్రచారమే జనాల్లోకి వెళ్లింది. చిరు కాపు సామాజికవర్గానికి చెందిన బిగ్ స్టార్ కావడంతో ఆ వర్గం చాలా హర్ట్ అయిందని..గత ఎన్నికల్లో వాళ్లు జగన్‌కు దూరంగా కావడానికి చిరును ఇన్సల్ట్ చేశారన్న ప్రచారం కూడా ఓ కారణమన్న చర్చ ఉంది.

అయితే అప్పుడు కూటమి ఆరోపణలపై వైసీపీ సమాధానంపై చిరంజీవి రియాక్ట్ కాలేదు. అసలు జగన్‌తో సినీ ప్రముఖుల భేటీలో ఏమి జరిగిందన్న దానిపై ఎంత రచ్చ జరిగినా మెగాస్టార్‌ వివరణ ఇవ్వలేదు. దాంతో చిరంజీవికి అవమానం జరిగిందన్నదే జనాల్లోకి బలంగా వెళ్లింది. అయితే బాలయ్య కామెంట్స్‌తో నొచ్చుకున్న చిరంజీవి ఇప్పుడు మాత్రం సుదీర్ఘంగా లేఖ ద్వారా వివరించారు.

అంతేకాదు తనకు ఎక్కడా అవమానం జరగలేదని..జగన్ సాదరంగానే ఆహ్వానించారని చిరంజీవి చెప్పడం ఆసక్తికరంగా మారింది. ముందుగా తనను ఇంటికి పిలిచి అన్ని విషయాలు చర్చించాక..ఆ తర్వాత సినీ ప్రముఖులతో జగన్‌ను కలిశామని చిరంజీవి చెప్పుకొచ్చారు. అయితే తన అన్నయ్య మెగాస్టార్‌కు అవమానం జరిగిందని జగన్ పిలిచి మరీ ఆయనను ఇన్సల్ట్ చేశారని పవన్ గతంలో చాలా చోట్ల ప్రచారం చేశారు. చిరంజీవి మాత్రం జగన్ చాలా మర్యాద ఇచ్చినట్లు..ఎక్కడా తనకు అవమానం జరగలేదన్నట్లు చెప్పుకొచ్చారు.

బాలయ్య కామెంట్స్..మెగాస్టార్ వివరణతో పవన్‌ రియాక్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చిందన్న జరుగుతోంది. తన అన్నను జగన్ అవమానించారన్న మాట మీదే పవన్‌ నిలబడితే మాత్రం బాలయ్య చెప్పిందే కరెక్ట్‌ అని ఆయనకే సపోర్ట్‌గా ఉండాలి. చిరంజీవి వ్యాఖ్యలను సమర్థిస్తే బాలయ్యకు కౌంటర్ ఇచ్చినట్లు అవుతుంది. పైగా అప్పుడు పవన్‌ చేసిన ఆరోపణలు తప్పని ఒప్పుకున్నట్లు అవుతుంది. ఇలా ఆల్‌ ఆఫ్ సడెన్‌గా బాలయ్య మాట్లాడిన మాటలు అటు కూటమిని, పవన్‌ను ఇరకాటంలో పడేశాయన్న చర్చ జరుగుతోంది. చిరంజీవిని టార్గెట్‌ చేయబోయే బాలయ్య సొంత కూటమినే డైలమాలో పడేశారన్న టాక్ నడుస్తోంది.

చిరంజీవి కామెంట్స్‌ను వైసీపీ అస్త్రంగా మల్చుకుని బాలయ్యపై అటాక్ చేస్తోంది. ఏకంగా అఖండ సినిమా కోసం బాలకృష్ణ తనకు స్వయంగా ఫోన్ చేశారని అప్పటి సినిమాటోగ్రఫీ మంత్రి పేర్నినాని పాత విషయాలను తోడారు. అంతేకాదు మీ ఇంట్లో కాల్పులు ఘటనలో వైఎస్సార్ ఎంత సాయం చేశాడో మర్చిపోయావా బాలకృష్ణ అంటూ దెప్పి పొడిపించుకోవాల్సి వచ్చింది.

బాలయ్య మాటలు ఇంతలా దుమారం లేపుతున్నాయి. పైగా ఆయన పర్సనల్‌గా కార్నర్ అయిపోవడంతో కూటమిని పరేషాన్‌లో పడేశారన్న గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు బాలయ్య వర్సెస్ చిరంజీవి ఎపిసోడ్‌లో చిరు ఇచ్చిన వివరణపై వైసీపీ క్యాడర్‌ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతోంది. జగన్‌ తనను సాదరంగా ఇన్వైట్ చేశారన్న చిరు కామెంట్స్‌పై వైసీపీ క్యాడర్ సోషల్‌ మీడియాలో కామెంట్స్‌, పోస్ట్‌లతో హోరెత్తిస్తోంది. బాలయ్య కామెంట్స్‌ అటు ఇటు తిరిగి వైసీపీ క్యాడర్‌కు స్వీట్‌ న్యూస్‌గా మారిందన్న టాక్ వినిపిస్తోంది.