మహిళా లోకానికి జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి : బీజేపీ నేత శ్రీనివాసులు

జేసీ ప్రభాకర్ రెడ్డి వయస్సుకు తగిన మాటలు మాట్లాడాలి. ఆయన లాంటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది.

మహిళా లోకానికి జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి : బీజేపీ నేత శ్రీనివాసులు

JC Prabhakar Reddy

Updated On : January 3, 2025 / 2:58 PM IST

JC Prabhakar Reddy: తాడిపత్రి మున్సిపల్ మాజీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలతో టీడీపీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షులు సందిరెడ్డి శ్రీనివాసులు స్పందించారు. బీజేపీ మహిళా నేత మాధవిలతపై జేసీ చేసిన వ్యాఖ్యలు జుగుస్సాకరంగా ఉన్నాయని శ్రీనివాసులు మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పట్ల జేసీ హీనంగా మాట్లాడారని, బీజేపీ కార్యకర్త ఒక్కరు ఉన్నా వీర శివాజీలాగా బతుకుతారని అన్నారు. అవసరమైనప్పుడు అధికారంకోసం పలాయనం చిత్తగించేలా వ్యవహారాలు నీలాగా బీజేపీ కార్యకర్తలు చేయరు అంటూ జేసీకి కౌంటర్ ఇచ్చారు.

Also Read: Thatikonda Rajaiah: ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. ఎమ్మెల్యే కడియంకు రాజయ్య వార్నింగ్

జేసీ ప్రభాకర్ రెడ్డి వయస్సుకు తగిన మాటలు మాట్లాడాలి. ఆయన లాంటి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. బీజేపీ తగలబెట్టే కార్యక్రమాలు, పగలగొట్టే కార్యక్రమాలు ఎప్పుడూ చేయదు. మహిళా లోకానికి జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సందిరెడ్డి శ్రీనివాసులు సూచించారు. నిత్యం వార్తల్లో ఉండాలని ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. అధికార పార్టీలో ఉండికూడా బస్సు దగ్దం ఘటనపై ఫిర్యాదు చేస్తే వాళ్లు ఏమీ చేయలేరని అనడం చూస్తుంటే మీరేం మాట్లాడుతున్నారో గ్రహించుకోవాలని శ్రీనివాసులు సూచించారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ ఒక్కరికి తలవంచరు. వీర శివాజీలా సమాజ హితం కోసం పనిచేస్తారని శ్రీనివాసులు అన్నారు.

Also Read: Pds Rice Case : రేషన్ బియ్యం మాయం కేసులో మరో ట్విస్ట్..

తాడిపత్రిలో జరిగిన నూతన సంవత్సర వేడుకలు జేసీ ప్రభాకర్ రెడ్డి, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు మాత్రమే అంటూ నిర్వహించిన వేడుకలపై బీజేపీ మహిళా నేతలు యామిని శర్మ, మాధవీ లతలు మండిపడ్డారు. ఈ క్రమంలో నియోజకవర్గ ప్రజలను కించపర్చే వ్యాఖ్యలు చేశారంటూ వారిపై టీడీపీ కౌన్సిలర్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో జేసీ ట్రావెల్స్ కు చెందిన బస్సు దగ్దం కావడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి మరింత ఆజ్యంపోశాయి. మాధవీ లతపై జేసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆమె పెద్ద వేస్ట్ అంటూ ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.