Viveka Case : వివేక హత్య కేసులో కీలక పరిణామం.. ఉదయ్‌కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. సాయంత్రం హైదరాబాద్ సీబీఐ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు.

YS Viveka Case
Viveka Case : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి (Uday Kumar Reddy) ని సీబీఐ అధికారులు (CBI officers) అరెస్టు చేశారు. ఈ కేసులో సుదీర్ఘంగా విచారణ జరిపిన అనంతరం ఉదయ్ కుమార్‌ను అరెస్టు చేశారు. అనంతరం అతన్ని హైదరాబాద్ సీబీఐ కోర్టు (Hyderabad CBI Court) లో హాజరుపర్చేందుకు కడప నుంచి తరలించారు. సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ సీబీఐ మెజిస్ట్రేట్ ముందు ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు హాజరుపర్చనున్నారు.
గూగుల్ టెక్ ఔట్ సమాచారం ఆధారంగా భాస్కర్ రెడ్డి నివాసంలో ఉదయ్ ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఉదయం పులివెందులలో అతడిని అదుపులోకి తీసుకొని కడప జైలు అతిథిగృహానికి తీసుకెళ్లి విచారించారు. అనంతరం ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులకు అధికారులు సమాచారం ఇచ్చారు. ఈ విచారణలో భాగంగా వివేకా హత్య రోజు నిందితులతో కలిసి ఉదయ్ కుమార్ రెడ్డి తిరిగినట్లు గుర్తించారు. హత్యలో ఉదయ్ కుమార్ రెడ్డి పాత్ర ఉన్నట్లు సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మరోవైపు ఉదయ్ కుమార్ రెడ్డి హత్యకేసు రోజు తన కుమారుడు అర్ధరాత్రి వరకు ఇంటికి రాకుండా నిందితులతో తిరిగాడంటూ ఉదయ్ కుమార్ తల్లి బహిరంగంగా చెప్పారు.
YS Viveka Case..New CBI Team : వివేకా కేసులో సీబీఐ కొత్త టీమ్ విచారణ
గత సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పై ఉదయ్ కుమార్ కేసు పెట్టిన విషయం విధితమే. తనని వేధింపులకు గురిచేస్తున్నాడని రామ్ సింగ్‌పై ఆరోపణలు చేశాడు. ఉదయ్ కుమార్ రెడ్డి తండ్రి ప్రకాశ్ రెడ్డి వైయస్ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి హాస్పిటల్లో కాంపౌండర్‌గా పనిచేస్తున్నాడు. ఈసీ గంగిరెడ్డి ఆదేశాలతో వైఎస్ వివేక మృతదేహానికి ప్రకాష్ రెడ్డి కుట్లు వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే, సునీల్ బెయిల్ పిటిషన్ కౌంటర్లో ఉదయ్ కుమార్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి పాత్రలపై సీబీఐ పేర్కొంది. ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. సాయంత్రం 4గంటల తరువాత హైదరాబాద్ సీబీఐ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చనున్నారు.