ఇక మొదలెడుదామా? తిరుమల నుంచే ప్రక్షాళన షురూ.. ఆ తర్వాత ఇవన్నీ..

ఒక్కోశాఖలో జరిగిన అవినీతిని మొత్తం బయటికి తీయడం ఖాయమంటోంది కూటమి సర్కార్. ఇందులో..

ఇక మొదలెడుదామా? తిరుమల నుంచే ప్రక్షాళన షురూ.. ఆ తర్వాత ఇవన్నీ..

Chandrababu Naidu

పోలవరం నుంచి సెక్రటేరియట్‌ వరకు..శాఖ ఏదైనా..అవినీతి చేసింది ఎంతపెద్దోళ్లు అయినా.. విడిచి పెట్టేదు లేదు. అలా కక్ష సాధింపు అసలే కాదు. ప్రజాసొమ్మును దుర్వినియోగం చేసినవారి లెక్కలు తీసి ప్రజల ముందు పెట్టేందుకు రెడీ అయింది ఏపీ సర్కార్. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని అంతా కక్కిస్తామంటున్నారు కూటమి నేతలు.

ఏయే డిపార్ట్‌మెంట్లలో అవినీతి జరిగింది.. ఎన్ని నిధులు డైవర్ట్‌ అయ్యాయి. ఎందుకు నిధులు పక్కదారి పట్టించారు.. ఎవరిరెవరి పాత్ర ఉందో పక్కా ప్రణాళికతో అన్ని లెక్కలు తీసి.. అవినీతిని తుడిచేసేందుకు రెడీ అయింది చంద్రబాబు ప్రభుత్వం. ఇంతకు ఏయే శాఖలపై విచారణ జరగబోతుంది.. అసలు ఏ శాఖలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రక్షాళన మొదలైంది. అవినీతి లెక్కలు తేల్చనున్నారు. కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దళారుల దందా, కాంట్రాక్టర్ల గోల్‌మాల్‌పై విచారణతో ప్రక్షాళనను మొదలుపెట్టింది కూటమి సర్కార్. వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ శ్రీవాణి ట్రస్ట్, ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో విజిలెన్స్ విచారణకు ఆదేశాలు వెళ్లాయి.. వెంటనే రంగంలోకి దిగిన స్టేట్ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ టీటీడీలో జరిగిన అక్రమాలపై తనిఖీలు కూడా మొదలుపెట్టింది.. ఐతే ఇప్పటికైతే ఈ విషయాన్ని గోప్యంగానే ఉంచుతోంది టీటీడీ.

శ్వేతపత్రాల రిలీజ్‌కు సిద్ధం
మరోవైపు శాఖలవారీగా శ్వేతపత్రాల రిలీజ్‌కు సిద్ధం అవుతోంది ఏపీ సర్కార్.. పోలవరం, అమరావతి, రోడ్లు, శాండ్, లిక్కర్‌ పాలసీపై వైట్‌ పేపర్ విడుదలకు రెడీ అవుతున్నారు ఏపీ ప్రభుత్వ పెద్దలు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో జరిగిన ఆలస్యం, అవినీతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం రిలీజ్ చేశారు. పోలవరం ప్రస్తుత దుస్థితికి కర్త, కర్మ, క్రియ జగనేనని చంద్రబాబు ఆరోపించారు.

పోలవరంపై పలుమార్లు జగన్‌ మాట్లాడిన మాటల్లో వ్యత్యాసంతో పాటు.. తనకు పోలవరం ప్రాజెక్టు అర్థంకాలేదన్న అప్పటి సాగునీటి మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్‌నూ చంద్రబాబు గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వం సెకండ్ ప్రయారిటీ అయినా అమరావతిపై శ్వేతపత్రం రిలీజ్‌కు రెడీ అయ్యారు చంద్రబాబు.

మంత్రి నారాయణ, అధికారుల నుంచి డిటెయిల్స్ తీసుకున్న ఏపీ సీఎం.. అమరావతిలో ఆగిపోయిన పనులు, గత సర్కార్ తీరుతో నష్టపోయింది ఎంత.. రాజధాని భవిష్యత్‌ ప్రణాళిక ఏంటో వివరించేందుకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు. ఇక ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై సమీక్ష చేశారు సీఎం. ఇసుక విధానంలో చేపట్టాల్సిన మార్పు, చేర్పులపై చర్చించారు.

గత ప్రభుత్వ హయాంలో ఇసుక మాఫియా రెచ్చిపోయిందని ఆరోపిస్తున్న కూటమి ప్రభుత్వం.. ఆ అంశంపై అన్ని వివరాలను సేకరించే ప్రయత్నం చేస్తోంది. అప్పుడు మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఇసుక మాఫియా నడిచిందనేది కూటమి నేతల ఆరోపణ. ఇసుక మాఫియా నిజమేనా.. అక్రమాలు ఏ మేరకు నడిచాయో అధికారులతో డిస్కస్ చేశారు చంద్రబాబు.

పంచాయతీరాజ్‌ శాఖలోనూ సేమ్‌ సీన్ 
పంచాయతీరాజ్‌ శాఖలోనూ సేమ్‌ సీన్ అంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌. అసలు తాను చూస్తున్న శాఖలో నిధులే లేవని.. ఎన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయో కూడా తెలియడం లేదని ప్రకటించారు. ఒక్కో విభాగంలొ తవ్వే కొద్దీ అక్రమాలు బయటికి వస్తున్నాయని..అన్నింటినీ సరిచేసేందుకు వరుసగా సమీక్షలు చేస్తున్నారు. శాఖ అప్పుల్లో ఉన్నప్పుడు జీతం తీసుకోవడం సరికాదనిపించి.. జీతం వదిలేస్తున్నట్లు ప్రకటించారు జనసేనాని. ఇలా శాఖ ఏదైనా అవినీతి అన్న ముచ్చటే లేకుండా.. ఇన్ అండ్ ఔట్ మొత్తం వాష్‌ ఔట్ కావాల్సిందేనంటున్నారు ఏపీ ప్రభుత్వ పెద్దలు.

మహిళల మిస్సింగ్‌పై కూడా ఫోకస్ పెట్టింది సర్కార్. ఏపీలో గతంలో 35వేల మంది మహిళలు తప్పిపోయినట్లు చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇప్పటివరకు ఎవరు ఎందుకు సీరియస్‌గా తీసుకోలేదో అర్థం కాలేదన్నారు. మిస్ అయిన మహిళలను ట్రేస్‌ చేసేందుకు స్పెషల్ సెల్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తోంది ఏపీ ప్రభుత్వం.

జగన్‌ ప్రభుత్వం సరఫరా చేసిన నిత్యావసరాలపైనా ఫోకస్ చేసింది ఏపీ ప్రభుత్వం. సివిల్ సప్లై శాఖలో జరిగిన అక్రమాలపై మంత్రి నాదెండ్ల మనోహర్ వరుస సమీక్షలు..ఫీల్డ్ విజిట్స్ చేస్తున్నారు. రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాల వెనుక మాఫియా ఉందని చెబుతున్నారు. పేద‌లకు అందాల్సిన స‌రుకులు రేష‌న్ షాపుల నుంచి ప‌క్కదారి ప‌ట్టించారని కూట‌మి స‌ర్కారు అనుమానిస్తోంది.

సీఐడీ విచారణ
ఇప్పటికే ఈ అంశంపై సీరియ‌స్‌గా ఉన్న పౌర స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్రమాల్లో సూత్రధారులు.. పాత్రధారులను గుర్తించేందుకు ఈ మొత్తం వ్యవహారంపై సీఐడీ విచారణ చేపడుతామని ప్రకటించారు. సేమ్‌టైమ్‌ అటు కాకినాడ నుంచి బియ్యం అక్రమ రవాణా జరిగిందన్న ఆరోపణలపై కూడా కన్నేసింది కూటమి సర్కార్.

మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం రోడ్ల విస్తరణ కాదు కదా.. కనీసం గుంతలు కూడా పూడ్చలేదనేది ప్రధాన ఆరోపణ. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా రాష్ట్రమంతటా రోడ్లు ధ్వంసమైతే..రోడ్లు బాగు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది గత సర్కార్. అందులో రూ.668 కోట్లు బకాయిలు ఉన్నాయని చెబుతోంది కూటమి ప్రభుత్వం. సీఎం చంద్రబాబు ఆర్‌అండ్‌బీ అధికారులతో సమీక్షతో.. గుంతల రోడ్లు, రోడ్ల విస్తరణ వంటి అంశాలపై కొంత క్లారిటీ వచ్చినా ఇంకా పూర్తిస్థాయి ఇన్ఫర్మేషన్ కోసం అధికారులకు ఆదేశాలు వెళ్లాయి.

ఇలా ఒక్కోశాఖలో జరిగిన అవినీతిని మొత్తం బయటికి తీయడం ఖాయమంటోంది కూటమి సర్కార్. ఇందులో అక్రమాలు జరిగాయి.. ఫలానా డిపార్ట్‌మెంట్‌లో అంతా సాఫీగా జరిగిందని చెప్పడానికే వీలేలేదని.. ఏ శాఖపై సమీక్ష చేసినా అవినీతి, అక్రమాలు, తప్పులు బయటపడుతుండటంతో.. ఒక్కోశాఖ వారిగా ఇప్పుడున్న నిధులెన్ని.. అసలు బిల్లులు ఎలా చెల్లించారు.. ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయనే లెక్కలు.. పక్కా ప్రణాళికతో.. వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని నిర్ణయించింది కూటమి సర్కార్.

Also Read: చంద్రబాబుకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ