Cm Chandrababu: టీడీపీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదు.. ఇకపై రోజంతా పార్టీ ఆఫీస్‌లోనే- సీఎం చంద్రబాబు
పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఇంకా బాగా కలిసి పనిచేసే దానిపై దృష్టి పెడతానని చంద్రబాబు అన్నారు.
Cm Chandrababu: పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్ చేశారు. తెలుగుదేశం ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదని ఆయన జోస్యం చెప్పారు. సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతామన్నారు. ఇకపై వారంలో ఒకరోజు పార్టీ ఆఫీస్ కి వచ్చి రోజంతా ఉంటాను అని చెప్పారు. పార్టీ కార్యాలయానికి వస్తే సొంతింటికి వచ్చినట్లు ఉంటుందన్నారు. అదే సమయంలో అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు. పార్టీ కార్యాలయంలో ఉంటేనే బాండింగ్ పెరిగి అన్ని విషయాలు తెలుస్తాయని చంద్రబాబు అన్నారు. వారంలో నేనొక రాజు, లోకేశ్ ఒక రోజు పార్టీ ఆఫీస్ లో ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఉంటామని చంద్రబాబు తెలిపారు.
ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని గాడిలో పెట్టామన్నారు. ఆటో పైలట్ లో పని చేసే విధంగా ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన పని విధానానికి, 4వసారి సీఎంగా చేసే దానికి చాలా తేడా ఉందన్నారు. ఇప్పుడు చేస్తున్నంత వేగంగా గత మూడు పర్యాయాలు పని చేయలేదన్నారు.
గత 3 పర్యాయాలు సీఎంగా చేసినప్పటికీ ఇప్పటికీ సాంకేతికత పెరగటంతో పరిపాలనాలో వేగం పెరిగి పాలన సులభతరమైందన్నారు. పెన్షన్ల పంపిణీలో పార్టీ నేతలు తప్పనిసరిగా పాల్గొనాలని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రభుత్వం చేపట్టే ప్రతీ కార్యక్రమమూ పార్టీ నేతలు ఓనర్ షిప్ తీసుకోవాలని సూచించారు. పార్టీ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు ఇంకా బాగా కలిసి పనిచేసే దానిపై దృష్టి పెడతానని చంద్రబాబు అన్నారు.
