సీఎం జగన్ కీలక నిర్ణయం, ఎన్డీయేలో చేరేందుకు విముఖత, స్వతంత్రంగా ఉంటేనే గుర్తింపు ఉంటుంది

cm jagan key decision: ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హస్తిన టూర్ ముగిసింది. ప్రధాని మోడీతో భేటీ పూర్తయిన తర్వాత అమరావతికి తిరుగుపయనమయ్యారు. ఇవాళ(అక్టోబర్ 6,2020) పలువురు కేంద్ర మంత్రులను కలుస్తారని ప్రచారం జరిగినా.. ఆయన ఎవరినీ కలువకుండానే ఏపీకి బయలుదేరారు.
జగన్, మోడీ భేటీపై రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీ ఎన్డీయేలో భాగస్వామ్యం అవుతుందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. వైసీపీకి రెండు కేంద్ర మంత్రులు, ఒక సహాయమంత్రి పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఎన్డీయేలో చేరేందుకు వైసీపీ విముఖత వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. స్వతంత్రంగా ఉంటేనే గుర్తింపు ఉంటుందనే ధీమా వైసీపీలో ఉంది. కాగా, అంశాల వారీగా బయట నుంచి మద్దతు ఇవ్వాలనే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా, ఇతర విభజన హామీల పరిష్కారంపై ప్రకటన చేస్తే ఎన్డీయేలో చేరిక గురించి ఆలోచించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక హోదా, రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ప్రస్తుతం వైసీపీ కోరుతోంది. ప్రత్యేక హోదాపై ఎలాంటి హామీ తీసుకోకుండా ఎన్డీయేలో చేరితే అది టీడీపీకి ఉపయోగపడే అవకాశం ఉందని వైసీపీ భావిస్తోంది. గతంలో ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా.. ఎన్డీయే నుంచి బయటకు రావాలని టీడీపీని డిమాండ్ చేసిన వైసీపీ.. ఎలాంటి హామీ లేకుండా ఎన్డీఏలో చేరితే రాజకీయంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీంతో ఎన్డీయేలో చేరేందుకు వైసీపీ విముఖత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.