కరోనాతో కలిసి బతకాల్సిందే.. సీఎం జగన్ చెప్పిందే సీఎం కేసీఆర్ చెప్పారు

కరోనా వైరస్. ఈ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కంటికి కనిపించని ఈ శత్రువు ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. కరోనా వైరస్ మానవాళి మనుగడను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇప్పటికే లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. లక్షల మందిని ఆసుపత్రి పాలు చేసింది. ఇంకా ఎంతమందిని బలితీసుకుంటుందో తెలియదు. కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ యుద్ధాల కన్నా ప్రమాదకరంగా మారింది.
ఈ ప్రాణంతక మహమ్మారి నుంచి ఎప్పుడు బయటపడతామా అని యావత్ మానవాళి ఎదురుచూస్తోంది. ఇంకా ఎన్ని రోజలు ఇలా ప్రాణాలు మాస్క్ లో పెట్టుకుని బతకాలి అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొన్ని నివేదికలు ఏమో, కరోనా మనతోనే ఉంటుంది, మరో రెండేళ్లు కరోనా మప్పు తప్పదు అని తేల్చాయి. వ్యాక్సిన్ వచ్చినా కరోనా నుంచి అప్పుడే బయటపడలేము అని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ లేకపోవడంతో లాక్ డౌన్ అనే అస్త్రాన్ని ప్రభుత్వాలు సంధించాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ మినహా మరో దారి లేదు.
కరోనా జీవితంలో భాగం, సహజీవనం తప్పదు:
ఈ క్రమంలో కరోనాపై ఏపీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరికొన్ని నెలలు కరోనాతో మనం సహజీవనం చేయాల్సిందే అని పదే పదే చెబుతున్నారు. కరోనా ప్రభావం ఇప్పటిలో తగ్గేది కాదన్నారు. ఎన్ని చర్యలు తీసుకున్నా కరోనా ప్రభావం కొద్ది నెలలపాటు కనిపిస్తుందని జగన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ మన జీవితంలో భాగమని, దానితో కలిసి జీవించాల్సి ఉంటుందని పదే పదే చెబుతున్నారు. దాన్ని ఎంత కట్టడి చేయాలనుకున్నా ఎక్కడో ఒక చోట కనిస్తుందన్నారు.
దానితో కలసి జీవించాలన్నది వాస్తవ విషయం అన్నారు. దగ్గడమో.. తుమ్మడమో చేస్తే అది పక్కవాళ్లకు వ్యాపిస్తుందని చెప్పారు. మన ఇంట్లో ఉన్న పెద్దవారిని రక్షించుకోవలసిన అవసరం ఉందని జగన్ మరోసారి చెప్పారు. కరోనా గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు భగ్గుమన్నాయి. కరోనాను కట్టడి చేయాల్సింది పోయి కరోనాతో సహజీవనం చేయాలని అనడం ఏంటని మండిపడ్డారు. సీఎం జగన్ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు విరుచుకుపడ్డారు. జగన్ ది అసమర్థ పాలన అని తిట్టిపోశారు.
జగన్ బాటలో కేసీఆర్, కరోనాతో కలిసి బతకాల్సిందే:
ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం జగన్ బాటలోనే పయనించారు. కరోనా గురించి జగన్ ఏవైతే వ్యాఖ్యలు చేశారో వాటినే సీఎం కేసీఆర్ కూడా చెప్పారు. ”కరోనాతో మనం కలిసి బతకాల్సిందే. కాకపోతే కాస్త తెలివి కావాలి. ఉపాయమున్నోడు అపాయం నుంచి తప్పించుకుంటాడు. కాబట్టి మనం ఉపాయంతో బతకాలి. తెలివిని ఇప్పుడు మనం సంతరించుకోవాలి. రేపో ఎల్లుండో పోయే గండం కాదు. ఇది మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పటివరకూ కొంత ఉపాయంతో రక్షించుకున్నాం. ఇక నుంచి ఉపాయంతో మనల్ని మనమే రక్షించుకోవాలి. ఎవరో వచ్చి మనల్ని కాపాడరు” అని సీఎం కేసీఆర్ స్వయంగా అన్నారు.
విపక్షాలు ఇప్పుడు ఏమంటాయి?
మంగళవారం(మే 5,2020) సీఎం కేసీఆర్ అధ్యక్షతన సుదీర్ఘంగా కేబినెట్ భేటీ జరిగింది. కరోనాపై తీవ్రమైన చర్చ జరిగింది. కేబినెట్ భేటీ తర్వాత సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కరోనా అప్పుడే పోయే గండం కాదని, కలిసి బతకాల్సిందే అని తేల్చి చెప్పారు. కరోనా గురించి సీఎం కేసీఆర్ చెప్పిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తెలుగు రాజకీయాల్లో చర్చక దారితీశాయి. కరోనా గురించి సీఎం జగన్ ఏమైతే చెప్పారో సరిగ్గా కేసీఆర్ కూడా అలానే చెప్పారు.
కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని జగన్ అంటే, విపక్షాలు దుమ్మెత్తిపోశాయని, మరిప్పుడు పొరుగు రాష్ట్రం సీఎం కేసీఆర్ కూడా అలాంటి మాటలే చెప్పారు, ఇప్పుడు ఏమంటారు? అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. జగన్ చెప్పింది అక్షర సత్యాలని, వాటిని జీర్ణించుకోవాల్సిన అవసరం ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించేలా విపక్షలు వ్యవహరిస్తున్నాయని వైసీపీ నేతలు ఫైర్ అయ్యారు. జగన్ చెప్పింది నిజం కాకపోతే, మరిప్పుడు కేసీఆర్ చెప్పింది ఏమిటని టీడీపీ సహా విపక్షాలను నిలదీస్తున్నారు.
Also Read | కరోనాతో కలిసి జీవించాలా, అది కేవలం జ్వరమా, ఇక ఏపీని దేవుడే కాపాడాలి