ఏపీలో కరోనా : 17కి చేరుకున్న మృతుల సంఖ్య…రెడ్ జోన్లు ఇవే

ఏపీలో కరోనాతో మరో ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఇప్పటికే ఏపీలో 603 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 132 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్‌జోన్లను ప్రకటించింది. మొత్తం 97 మండలాలు కరోనా ప్రభావిత ప్రాంతాలుగా పేర్కొంది. 2020, ఏప్రిల్ 20వ తేదీ సోమవారం కేంద్ర మార్గదర్శకాలను అమలు చేస్తారు.
శనివారం వరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల నమోదును అనుసరించి రెడ్‌జోన్ మండలాలను ఖరారు చేసింది. రాష్ట్రంలో 676 మండలాలున్నాయి. మండల కేంద్రం యూనిట్‌గా తీసుకుని రెడ్‌జోన్లలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించింది ప్రభుత్వం. రెడ్‌జోన్లలో 14 రోజుల పాటు పాజిటివ్ కేసు నమోదు కాకుండా ఆ మండలాన్ని ఆరెంజ్‌జోన్‌గా ప్రకటిస్తారు. ఆ తర్వాత 14 రోజుల పాటు పాజిటివ్ కేసులు రాకపోతే అప్పుడు గ్రీన్‌జోన్ పరిధిలోకి చేరినట్లు ప్రకటిస్తారు. ఒకవేళ గ్రీన్‌జోన్‌లో కేసులు వస్తే వెంటనే రెడ్‌జోన్‌గా మారుస్తారు.
కేంద్ర ప్రభుత్వం ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం మినహా మిగిలిన 11 జిల్లాలను హాట్‌స్పాట్లుగా ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జిల్లా మొత్తాన్ని హాట్‌స్పాట్‌గా ప్రకటించడం సరికాదంటోంది.. ఇక, ఆంధ్రప్రదేశ్ లోనూ కరోనా విజృంభణ కొనసాగుతున్నది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 608కి చేరుకుంది. కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 15కు పెరిగింది. రాష్ట్రంలో గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కరోనా కరాళ నృత్యం చేస్తున్నది. కర్నూలు జిల్లాలో 129, గుంటూరు జిల్లాలో 126 మంది కరోనా బారిన పడ్డారు.
అనంతపురం 26 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృత్యువాత పడ్డారు. చిత్తూరు 30, తూ.గోదావరి 24, గుంటూరు 126 కేసులు నమోదు కాగా, 04 మరణించారు. కడప 37, కృష్ణా జిల్లాలో 70 కేసులు బయటపడ్డాయి. ఐదు మరణాలు సంభవించాయి. కర్నూలు 129 వీరిలో 2 మరణాలు, నెల్లూరు లో 67 కేసులు రెండు మరణాలు, ప్రకాశం 44, విశాఖలో 20 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు ఇప్పటి వరకు కరోనాకు దూరంగా ఉన్నాయి.
ఏపీలో రెడ్‌జోన్ల వారీగా ఉన్న మండాలను చూస్తే కర్నూలు జిల్లాలో 17 మండలాలు కరోనా కోరల్లో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 14 మండలాలు , గుంటూరు జిల్లాలో 12, పశ్చిమగోదావరి జిల్లాలో 9, ప్రకాశం జిల్లాలో 9, తూర్పుగోదావరిలో 8, చిత్తూరులో 8, కడపలో 7 , కృష్ణా జిల్లాలో 5, అనంతపురం జిల్లాలో 5, విశాఖలో 3 మండలాలు రెడ్‌జోన్ పరధిలోకి వచ్చాయి.