ఏపీలోని ప్రభుత్వ స్కూల్స్‌లో కరోనా కల్లోలం.. వందల సంఖ్యలో విద్యార్థులు, టీచర్లకు కొవిడ్

  • Published By: naveen ,Published On : November 5, 2020 / 12:57 PM IST
ఏపీలోని ప్రభుత్వ స్కూల్స్‌లో కరోనా కల్లోలం.. వందల సంఖ్యలో విద్యార్థులు, టీచర్లకు కొవిడ్

Updated On : November 5, 2020 / 1:07 PM IST

coronavirus tension in ap government schools: ఏపీలోని స్కూల్స్‌లో కరోనా కోరలు చాస్తోంది. రోజురోజుకి పెరుగుతున్న కరోనా కేసులతో విద్యార్ధులు స్కూల్‌కు రావాలంటేనే భయపడిపోతున్నారు. మొన్న ప్రకాశం.. నిన్న నెల్లూరు, చిత్తూరు.. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా… పాఠశాలల్లో కరోనా క్రమక్రమంగా విస్తరిస్తోంది. ప్రకాశం జిల్లాలోని కంభం, బెస్తవారిపేట మండలాల్లోని ప్రభుత్వ స్కూల్స్ లో కరోనా కలకలం రేపింది. ఇద్దరు విద్యార్ధులు, ఒక పీడీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. దీంతో విద్యార్ధులతో పాటు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

కరోనా ప్రభావం ఇంకా తగ్గని ఏపీ జిల్లాల్లో విద్యార్ధులు, టీచర్లు వైరస్‌ బారిన పడుతున్నారు. ప్రకాశం జిల్లాలోని చాలా స్కూల్స్ లో విద్యార్ధులకు కరోనా సోకింది. ప్రకాశం జిల్లాలోని 10 జడ్పీ పాఠశాలల్లో ఉపాధ్యాయులు, విద్యార్ధులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇందులో జరుగుమల్లి మండలం పచ్చవలో ఇద్దరు విద్యార్ధులతో పాటు ఓ టీచర్‌ వైరస్‌ బారిన వడ్డారు. త్రిపురాంతకం జడ్పీ స్కూల్ లో ఓ టీచర్ కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పీసీపల్లి హైస్కూల్‌లోనూ ఓ విద్యార్ధి.. మరో ఉపాధ్యాయుడికి కరోనా సోకింది. పెద్దగొల్లపల్లిలోని మరో ఉపాధ్యాయుడికి కరోనా నిర్ధారణ అయింది.

కరోనా కేసులు పెరుగుతుండడంతో విద్యార్ధులు, తల్లితండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో విద్యాశాఖ అధికారులు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు చెప్పాలని సూచించారు.

మరోవైపు చిత్తూరు జిల్లాలోనూ ప్రభుత్వ పాఠశాలలపై కరోనా పంజా విసిరింది. జిల్లావ్యాప్తంగా గవర్నమెంట్‌ స్కూల్స్‌లో 200 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో కలకలం రేగింది. ఇప్పటిదాకా 187 మంది టీచర్లు, 13 మంది విద్యార్థులకు వైరస్‌ సోకింది. కుప్పం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లోనే ఎక్కువ కేసులు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన వైద్యశాఖ అధికారులు… కరోనా బారినపడిన విద్యార్థులు, టీచర్లకు పరీక్షలు చేసి… చికిత్స అందిస్తున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లాలోని స్కూల్స్ లో కరోనా విజృంభణ మామూలుగా లేదు. 120 మంది టీచర్లు, 200 మంది విద్యార్థులు కొవిడ్ బారిన పడ్డారు. కామవరపు కోట మండలంలో 10మంది విద్యార్థులు, ముగ్గురు తల్లిదండ్రులకు కరోనా సోకింది. పెదవేగి మండలం కూచంపూడిలో నలుగురు విద్యార్థులకు.. నల్లజర్ల మండలం సింగరాజుపాలెంలో 11మంది విద్యార్థులకు, నలుగురు టీచర్లకు కరోనా నిర్ధారణ అయ్యింది.