Chandrababu Arrest: ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డు మీద హత్య చేశారు.. అరెస్ట్ అనంతరం చంద్రబాబు

ప్రభుత్వం అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు వందల మంది టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారని, ప్రజలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు.

Chandrababu Arrest: ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డు మీద హత్య చేశారు.. అరెస్ట్ అనంతరం చంద్రబాబు

Updated On : September 9, 2023 / 8:44 AM IST

AP Politics: తన అరెస్టు మీద చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని నడిరోడ్డుపై హత్యచేశారంటూ అరెస్ట్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే అడ్డుకుంటున్నారని, తాను తప్పు చేస్తే నిరూపించాలని సవాలు విసిరారు. తాను ప్రజల తరపున న్యాయంగా పోరాడుతున్నానని, చివరకు ధర్మమే గెలుస్తుందని అన్నారు. ప్రజలు, టీడీపీ కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.

తాను ప్రజాసమస్యలపై పోరాడుతున్నానని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం అణచివేసే ధోరణిలో వ్యవహరిస్తోందని అన్నారు. ఇప్పటి వరకు వందల మంది టీడీపీ నేతల్ని అరెస్ట్ చేశారని, ప్రజలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. తాను ఏ తప్పూ చేయలేదని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అణచివేయాలని చూస్తోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో శనివారం ఉదయం ఆరు గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసినట్టు పేర్కొన్నారు పోలీసులు. సీఆర్పీసీ సెక్షన్ 50(1) నోటీస్ సర్వ్ చేశారు. ఇది సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు పేరు మీద వచ్చింది. 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్ చట్టం కింద చంద్రబాబును అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. చంద్రబాబు బాబు మీద 120(బీ), 166, 167,418, 420, 465, 468, 201, 109, రెడ్‌ విత్‌ 34 ఎండ్‌ 37 ఏపీసీ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.

2015లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌- సీమెన్స్‌ ప్రాజెక్టు వెలుగులోకి వచ్చింది సీమెన్స్‌, డిజైన్‌ టెక్‌ సంస్థలతో టీడీపీ ప్రభుత్వం ఒప్పందం జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం 3,356 కోట్ల రూపాయలు. కాగా రాష్ట్ర ప్రభుత్వ వాటా 10 శాతం ఉంది. 371 కోట్ల రూపాయలు దారి మళ్లాయని ఆరోపణలు వచ్చి నేపథ్యంలో.. వైపీసీ నేతృత్వంలోని ప్రభుత్వం 2020 ఆగస్టులో విచారణకు ఆదేశించారు. మంత్రివర్గ ఉపసంఘంతో విచారణ జరిగింది. 2020 డిసెంబరు 10న విజిలెన్స్‌ విచారణ చేపట్టారు. 2021 ఫిబ్రవరి 9న ఏసీబీ విచారణ ప్రారంభించింది. 2021 డిసెంబర్‌ 9న ఈ కేసును సీఐడీకి బదిలీ చేశారు.