ఏమైనా ఇబ్బంది ఉందా..1902కు ఫోన్ చేయండి..సహాయం చేస్తాం – సీఎం జగన్

కరోనా విషయంలో ఏపీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కానీ ఈ వ్యాధిని అరికట్టాలంటే ఎక్కడి వారక్కడే ఉండిపోవాలని సూచించారు సీఎం జగన్. రాష్ట్ర ప్రజలకు ఏమైనా సమస్య ఉన్నా వెంటనే 1902 (హెల్ప్ లైన్) ఫోన్ చేయాలని సీఎం సూచించారు.
ఆరోగ్య సమస్యలు ఉంటే..హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేస్తే..కలెక్టర్ స్పందిస్తారన్నారు. జ్వరం, జలుబు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే వైద్యులను సంప్రదించాలన్నారు. అవసరమైన వారికి భోజనం, వసతి, తదితర ఏర్పాట్లు చేస్తామని, కానీ ఎవరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు రావొద్దన్నారు.
నిత్యావసర సరుకులు, ఇతర వస్తువుల కొరత ఉండదని స్పష్టం చేశారు. 2020, మార్చి 26వ తేదీ గురువారం సాయంత్రం ఆయన కరోనా పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం దీనిపై ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఏపీలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. రాష్ట్రంలోకి 27 వేల 819 మంది వచ్చారని, వీరిపై నిఘా పెట్టడం జరిగిందన్నారు. 4 చోట్ల క్రిటికల్ ఆసుపత్రులు, 213 వెంటిలెటర్లు ఏర్పాటు చేశామన్నారు. 80.9 శాతం ఇళ్లలో ఉంటే నయం అవుతుందని, కేవలం 14 శాతం మాత్రం ఆసుపత్రిలోకి వెళ్లే పరిస్థితి ఉందని, మిగతా 4 శాతం మందికి ఐసీయూ అవసరం ఉంటుందన్నారు సీఎం జగన్.