Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. చివరిరోజు రెండు రూపాల్లో దుర్గమ్మ దర్శనం.. సాయంత్రం తెప్పోత్సవం

దసరా ఉత్సవాల్లో తొమ్మిదోరోజు సోమవారం ఉదయం అమ్మవారు మహిషాసురమర్దని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి ...

Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు.. చివరిరోజు రెండు రూపాల్లో దుర్గమ్మ దర్శనం.. సాయంత్రం తెప్పోత్సవం

Dussehra Sharan Navaratri Celebrations

Updated On : October 23, 2023 / 10:37 AM IST

Dussehra Sharan Navaratri Celebrations : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. ఉత్సవాల్లో చివరిరోజు అమ్మవారు రెండు రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం మహిషాసురమర్దనిగా.. మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరిదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఆదివారం దుర్గాదేవి రూపంలో అమ్మవారు దర్శనమివ్వగా.. సోమవారం ఉదయం నుంచే మహిషాసుమర్దనిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

Read Also : Navaratri 2023 : ధైర్య స్థైర్య, విజయాలు చేకూర్చే జగన్మాత.. ఈరోజు మహిషాసురమర్దనిగా.. శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా..

దసరా ఉత్సవాల్లో తొమ్మిదోరోజు సోమవారం ఉదయం అమ్మవారు మహిషాసురమర్దని రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించిన దుర్గాదేవి దేవతులు, రుషులు, మానవుల కష్టాలను తొలగించింది. మహిషాసురమర్దనీ దేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శిచుకుంటే సర్వదోషాలు తొలగిపోతాయని, సాత్విక భావం ఉదయిస్తుందని, ధైర్యం, స్థైర్య, విజయాలు కూడా చేకూరుతాయని భక్తుల నమ్మకం. అయితే, సోమవారం తెల్లవారు జామున 4 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు మహిషాసురమర్దని రూపంలో దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకొనేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి దుర్గమ్మ రాజరాజేశ్వరీదేవి రూపంలో భక్తులకు దర్శనమివ్వనుంది. చెరకుగడను వామ వాస్తముతో ధరించి దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదింపజేసే రూపంతో శ్రీ షోడశాక్షరీ మహామంత్ర స్వరూపిణిగా శ్రీ చక్రరాజ అధిష్టాన దేవతగా వెలుగొందే శ్రీరాజరాజేశ్వరి దేవిని దర్శించుకుంటే సర్వ శుభాలు కలుగుతాయనేది భక్తుల నమ్మకం. రాజరాజేశ్వరీదేవి దివ్యదర్శనంతో జీవితం ధన్యమవుతుంది. సకల శుభాలు, విజయాలు సిద్ధిస్తాయనేది భక్తుల నమ్మకం

Read Also : Navaratri 2023 : కష్టాలు పోగొట్టి సకల శుభాలనొసగే ‘శ్రీ దుర్గాదేవి’

దసరాశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరిరోజు సోమవారం సాయంత్రం కృష్ణా నదిలో దుర్గామల్లేశ్వరుల తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు అన్నిఏర్పాట్లు పూర్తి చేశారు. అందమైన హంస వాహనంపై గంగ, పార్వతీసమేత మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను కూర్చోబెట్టి త్రిలోక సంచారానికి గుర్తుగా కృష్ణా నదిలో మూడుసార్లు జల విహారం చేయిస్తారు. తెప్పోత్సవంకోసం సాయంత్రం 5గంటలకు కొండపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి అర్జునవీధి మీదుగా ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కృష్ణా నది వద్దకు తీసుకొస్తారు. దుర్గాఘాట్ లో సిద్ధంగా ఉంచిన హంసవాహనంపై ఉత్సవ మూర్తులను కూర్చోబెట్టి కృష్ణా విహారానికి తీసుకెళతారు. తెప్పోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలిరానున్నారు. దుర్గాఘాట్, పున్నమిఘాట్, ప్రకారం బ్యారేజి నుంచి తెప్పోత్సవాన్ని వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. మరోవైపు దసరా ఉత్సవాలు ముగుస్తుండటంతో ఇంద్రకీలాద్రికి భవానీ భక్తుల రాక పెరిగింది. దసరా ముగిసిన తరువాతకూడా రెండు రోజుల పాటు భవానీలు తరలిరానున్నారు.