రాజకీయాల్లో కష్టాలు ఎవరికీ శాశ్వతం కాదు- వైఎస్ జగన్
ప్రజలకు మంచి చేసే పార్టీ ఎప్పుడూ అబద్దాలు చెప్పబోదని జగన్ పేర్కొన్నారు.

Ys Jagan Mohan Reddy (Photo Credit : Google)
Ys Jagan Mohan Reddy : రాజకీయాల్లో కష్టాలు ఎవరికీ శాశ్వతం కాదన్నారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రేపల్లె నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన జగన్.. వైసీపీకి మంచి రోజులు వస్తాయన్నారు. వైసీపీ ఐదేళ్ల కాలంలో ప్రపంచానికి తెలిసేలా పాలన అందించామన్నారు. ప్రజలకు మాయమాటలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని జగన్ ఆరోపించారు. ప్రజలకు మంచి చేసే పార్టీ ఎప్పుడూ అబద్దాలు చెప్పబోదని జగన్ పేర్కొన్నారు. అటు, ఇటీవల టీడీపీలో చేరిన మాజీ ఎంపీ మోపిదేవిని.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే రాజ్యసభకు పంపించామన్నారు.
”గత ఎన్నికల సమయంలో చంద్రబాబు అబద్దాలతో మనం పోటీ పడలేకపోయాం. ఒకవేళ అలాంటి అబద్దాలు చెప్పి ఉంటే నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వాడినేమో. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు మోసాలతో టీడీపీ కార్యకర్తలు ఏ ఇంటికీ వెళ్లలేని పరిస్థితి వచ్చింది.
ఎన్నికల మ్యానిఫెస్టో అన్న దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చింది మనమే..
”కష్టాలు ఏవైనా శాశ్వతంగా ఉండవు. అది అందరం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. రాజకీయాల్లో కానీ, కుటుంబంలో కానీ.. ఎక్కడైనా సరే.. విలువలు, విశ్వసనీయత అన్న పదం మనల్ని శ్రీరామరక్షగా కాపాడుతుంది. ఎన్నికల మ్యానిఫెస్టో అన్న దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చింది మనమే. అదొక చెత్త బుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదని, ప్రపంచానికి తెలియజెప్పిన పాలన ఎక్కడైనా ఉందని అంటే.. అది కేవలం ఒక ఐదు సంవత్సరాల వైసీపీ పాలనే అని గర్వంగా చెప్పగలను. మొట్టమొదటి సారిగా చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా బడ్జెట్ ప్రవేశ పెట్టేటప్పుడే సంక్షేమ క్యాలెండర్ కూడా ప్రవేశపెట్టాం.
చంద్రబాబు నాయుడి మాదిరి అబద్దాలు చెప్పి ఉంటే సీఎం అయ్యేవాడినేమో..
ఈ నెల ఈ పథకం ఇస్తాం, ఈ నెల ఈ పథకం ఇస్తామని చెప్పి.. బడ్జెట్ తో పాటు సంక్షేమ క్యాలెండర్ కూడా ప్రకటించాం. ప్రతి నెల మిస్ కాకుండా బటన్ నొక్కి పారదర్శకంగా ప్రతి ఇంటికి కూడా లబ్ది చేకూర్చాం. అది వైసీపీ ప్రభుత్వంలో మాత్రమే జరిగింది. ఇంట్లో ఎవరున్నా ఉండు, ఎంతమంది అన్నా ఉండు.. అంతమందికి డబ్బులు ఇస్తామని అబద్దాలు చెప్పారు. నేను కూడా చంద్రబాబు నాయుడి మాదిరి అబద్దాలు చెప్పడంలో పోటీ పడి ఉంటే.. ఇవాళ కచ్చితంగా అధికారంలోకి వచ్చే వాళ్లం ఏమో. ముఖ్యమంత్రి స్థానంలో నేను ఉండే వాడినేమో.
మోపిదేవి రమణ అన్న ఎమ్మెల్యేగా ఓడిపోయినా నా క్యాబినెట్ లో ఆయనకు మంత్రి పదవి ఇచ్చాను. మంత్రిని చేశాను. 151 స్తానాలు గెలిచినప్పుడు కూడా రమణ అన్న గెలవలేదు. వైసీపీ ఓడిన 24 స్థానాల్లో రమణ అన్న స్థానం ఒకటి. అయినా ఆయనను మర్చిపోలేదు. ఎమ్మెల్సీలను రద్దు చేయాలి అనుకున్నప్పుడు.. ఆ పరిస్థితి వస్తే ఆయన పదవి పోతుందేమో అని చెప్పి రాజ్యసభకు పంపడానికి కూడా ఎక్కడా వెనుకడుగు వేయలేదు. ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడే రాజ్యసభకు కూడా పంపాను. మొట్టమొదటిసారిగా ఒక మత్స్యకారుడిని రాజ్యసభకు పంపిన పాలన ఎప్పుడైనా జరిగిందని అంటే.. అది కేవలం వైసీపీ పాలనలోనే” అని జగన్ అన్నారు.
Also Read : ఐఏఎస్ ఆమ్రపాలికి ఊహించని షాక్ ఇచ్చిన కేంద్రం..!