ముంబై నటి కేసు.. అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు

సజ్జలను ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయనేమీ పాపాత్ముడు కాదు. ఆయన నిజాయితీగా ఉండే వ్యక్తి. ఆయన వైఎస్ జగన్ కు సలహాదారుడిగా ఉండటమే పాపమా?

ముంబై నటి కేసు.. అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు

Ambati Rambabu : ఏపీ సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు జీవితమంతా కొనుగోలు, అమ్మకాలేనని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడి వారు గట్టిగా నిలబడ్డారని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలను చూసైనా ఈ ఎంపీలు బుద్ది తెచ్చుకోవాలని హితవు పలికారు. ఎంతమంది వెళ్లినా వైసీపీకి 40 శాతం మంది ఓటర్లు ఉన్నారని గుర్తించాలన్నారు అంబటి రాంబాబు.

చంద్రబాబు తీరు కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లుగా ఉంది..
చంద్రబాబు, ఎల్లో మీడియా కలిసి సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. ముంబై నటి కేసుతో సజ్జలకు ఏం సంబంధం ఉందని ప్రశ్నించారు. ముంబై నటి కేసు వ్యవహారంలో చంద్రబాబు హడావుడి.. కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్టుగా ఉందని విమర్శించారు. అదంతా త్వరలోనే భూమ్ రాంగ్ అవుతుందన్నారు అంబటి రాంబాబు. ముంబై నటి వ్యవహారాలన్నీ త్వరలోనే బయటకు వస్తాయన్నారు. చంద్రబాబు స్కామ్ చేసినందుకే అరెస్ట్ అయ్యారని అంబటి రాంబాబు పేర్కొన్నారు. ముంబై నటి కేసు తీరు చూస్తుంటే.. చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారులపై కక్ష తీర్చుకుంటున్నట్లుగా ఉందని ఆయన ఆరోపించారు.

ముంబై నటి కేసులో నిజాలన్నీ బయటకు వస్తాయి..
”పార్టీ నుంచి ఎవరు వెళ్లినా, ఎంత మంది వెళ్లినా నష్టం లేదు. నీతి నిజాయితీగా ఉన్న వాళ్లు పార్టీ మారరు. ముంబై నటి కేసుకు సజ్జలకు ఏం సంబంధం? కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదాలని అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుంతో. ముంబై నటిని తీసుకొచ్చారుగా. ఈ కేసు కచ్చితంగా బూమరాంగ్ అవుతుంది. ముంబై నటి కేసులో ఏదో చేయాలని చంద్రబాబు గాలి మేడలు కడుతున్నారు. నిజానిజాలు నిదానంగా బయటకు వస్తాయి. వలసలను ప్రోత్సహించటం చంద్రబాబుకు అలవాటు.

సజ్జల పాపాత్ముడు కాదు..
సజ్జలను ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయనేమీ పాపాత్ముడు కాదు. ఆయన నిజాయితీగా ఉండే వ్యక్తి. ఆయన వైఎస్ జగన్ కు సలహాదారుడిగా ఉండటమే పాపమా? నేను మంత్రిగా ఉండటమే పాపమా? మా మీద కక్ష సాధింపులా? చాలా దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. నిదానంగా వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఎవరు ఏంటో, ముంబై నటి ఏంటో, ఆమె కథ ఏంటో, ఆమె పూర్వ పరాలు ఏంటి, ఆమె ఏం చేసింది.. ఇవన్నీ బయటకు వస్తాయి. ప్రభుత్వం మీ చేతిలో ఉందని, మీడియా మీ చేతిలో ఉందని కట్టుకథనాలు మీరు వినిపిస్తే అవి అవి నిలబడతాయా?

చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారులపై కక్ష తీర్చుకోవాలనే ఆలోచన దారుణం..
ఓ కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన అధికారులు అందరి మీద కక్ష సాధిస్తున్నారు. అధికారులు చట్ట ప్రకారమే ముందుకెళ్లారు. చంద్రబాబు స్కామ్ చేశారు, అందులో అరెస్ట్ చేశారు. అది చట్టప్రకారమే జరిగింది. అరెస్ట్ చేసిన అధికారులపై, అరెస్ట్ చేసేందుకు దోహదం చేసిన అధికారులపై కక్ష తీర్చుకోవాలనే ఆలోచన దారుణం. ఐపీఎస్ లు కాదంట, వైసీపీఎస్ లంట.. ఇదెక్కడి విడ్డూరం. జగన్ పాలనలో పని చేసిన వారంతా వైసీపీ వాళ్లే అంట. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి ఆదేశాల ప్రకారం, చట్ట ప్రకారం అధికారులు పని చేస్తారు. వారిపై కక్ష తీర్చుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసులు, సజ్జలను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ఉడత ఊపులకు మేము భయపడేదే లేదు” అని అంబటి రాంబాబు అన్నారు.

 

 

Also Read : అమ్మాయిల బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు..! కాలేజీ యాజమాన్యం ఏమందంటే..