ఏపీలో తొలి కరోనా కేసు, నెల్లూరు యువకుడికి పాజిటివ్

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనూ విజృంభిస్తోంది. ఏపీలో తొలి కరోనా కేసు నమోదైంది. నెల్లూరులో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడికి కరోనా పాటిటివ్ వచ్చింది. ఆ యువకుడు రెండు వారాల క్రితం ఇటలీ నుంచి నెల్లూరు చిన్నబజార్ వచ్చాడు. కరోనా లక్షణాలతో ఆసుపత్రిలో చేరాడు. అతడికి పరీక్షలు చేయగా కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని, 14 రోజుల తర్వాత ఇంటికి వెళ్లొచ్చని డాక్టర్లు చెప్పారు.
కరోనా బాధితుడు మరో ఐదుగురిని కలిసినట్టు అధికారులు నిర్ధారించారు. ఆ ఐదుగురిలోనూ కరోనా అనుమానిత లక్షణాలు బయటపడ్డాయి. ఏపీలో తొలి కరోనా కేసు నమోదు కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్నవారిని కూడా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక వార్డుల్లో వారందరికి చికిత్స అందిస్తున్నారు.
బాధితుడిది నెల్లూరు చిన్నబజార్ వాసి. రెండు వారాల క్రితం ఇటలీ నుంచి వచ్చాడు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో పరీక్షలు నిర్వహించిన సమయంలో ఆ యువకుడికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో వెంటనే అధికారులు అతడిని కరోనా వార్డుకి తరలించారు. ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రక్త నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపారు. రిపోర్టులో కరోనా పాటిజివ్ అని వచ్చింది. దీంతో ఏపీలో తొలి కరోనా కేసు నమోదైనట్టు అయ్యింది. ఆ యువకుడికి కరోనా సోకినట్టు గురువారం(మార్చి 12,2020) అధికారికంగా ప్రకటించారు నెల్లూరు వైద్య సిబ్బంది.
14 రోజుల తర్వాత ఆ యువకుడిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయన్నారు. ఈ 14 రోజులు అతడు ఇంట్లో వారిని బయటి వ్యక్తులను కలవడం జరిగింది. నెల్లూరులోని చిన్నబజార్, సంతపేట, గంగరాజుల గుడి ప్రాంతాల్లో సంచరించినట్టు అధికారులు గుర్తించారు. చెన్నై నుంచి వస్తున్న క్రమంలో బస్సు డ్రైవర్, కండక్టర్లతో ఆ యువకుడు సన్నిహితంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నెల్లూరుకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత అతడిలో దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. దీంతో అతడిని నెల్లూరు జనరల్ హాస్పిటల్ కు తరలించి అబ్జర్వేషన్ లో ఉంచారు. అతడి నమూనాలను తిరుపతిలోని ల్యాబ్ కు పంపారు. రిపోర్టులో 50-50 అని వచ్చింది. ఆ తర్వాత నమూనాలను పుణేలోని ల్యాబ్ కు పంపారు. వారి రిపోర్టులో పాజిటివ్ అని వచ్చింది.
2019 డిసెంబర్ లో చైనాలోని వూహాన్ లో వెలుగు చూసిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాని సర్వ నాశనం చేసిన కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. 100కుపైగా దేశాల్లో కరోనా వ్యాపించింది. 4వేల మంది చనిపోయారు. లక్షకు పైగా బాధితులు కరోనా బారిన పడ్డారు. కరోనా వైరస్ ను ప్రపంచ మహమ్మారిగా డబ్ల్యూహెచ్ వో ప్రకటించిందంటే.. వైరస్ తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనాకు ఇప్పటివరకు వ్యాక్సిన్ కనుక్కోలేదు. దీంతో అంతా భయపడుతున్నారు. కరోనా ప్రాణాంతకం కాకపోయినా అజాగ్రత్తగా ఉంటే మాత్రం చంపేస్తుంది.
See Also | అసలేం జరిగింది, మిస్టరీగా మారిన ప్రభుత్వ టీచర్ ఆత్మహత్య