ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్న వైఎస్ జగన్
తాడేపల్లి నుంచి రేపు ఉదయం 10.15 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు పొదిలిలో హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు.

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు ప్రకాశం జిల్లా పొదిలిలో పర్యటించనున్నారు. తాడేపల్లి నుంచి రేపు ఉదయం 10.15 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 11 గంటలకు పొదిలిలో హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం నేరుగా రోడ్డు మార్గంలో పొగాకు కేంద్రం వద్దకు వెళ్తారు.
పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకుంటారు. గిట్టుబాటు ధర కోసం డిమాండ్ చేస్తున్న పొగాకు రైతులతో ఆయన మాట్లాడతారు. ముందుగా తీసుకున్న నిర్ణయం ప్రకారం గత నెల 28నే పొదిలి పొగాకు బోర్డు వద్దకు జగన్ వెళ్లాలని అనుకున్నారు.
వాతావరణ పరిస్థితుల బాగోలేకపోవడంతో ఆయన పర్యటన వాయిదా పడింది. దీంతో రేపు అక్కడకు వెళ్లాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ఇప్పటికే పలువురు వైసీపీ స్థానిక నేతలు పొదిలి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. పొగాకు కొనుగోళ్లను పరిశీలించారు. రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను గురించి తెలుసుకున్నారు.