Ysrcp Digital Book: ఎక్కడో తేడా కొడుతోంది సీనా..! క్యాడర్‌లో ధైర్యం కోసం.. జగన్ తెచ్చిన ఆ అస్త్రంతో.. వైసీపీకి కొత్త త‌ల‌నొప్పులు..!

దీంతో వైసీపీ పెద్దలు అవాక్కవుతున్నారట. ఏం చేయాలి? దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై అంతర్మథ‌నం చెందుతున్నారు.

Ysrcp Digital Book: ఎక్కడో తేడా కొడుతోంది సీనా..! క్యాడర్‌లో ధైర్యం కోసం.. జగన్ తెచ్చిన ఆ అస్త్రంతో.. వైసీపీకి కొత్త త‌ల‌నొప్పులు..!

Updated On : October 3, 2025 / 11:48 PM IST

Ysrcp Digital Book: ఇవాళ్టి మీ బాధ. రేపటి మన రివేంజ్. రాసిపెట్టుకోండి..అందరి లెక్కలు సరిచేద్దామంటూ డిజిటల్ బుక్‌ను తీసుకొచ్చారు మాజీ సీఎం జగన్. పార్టీ లీడర్లు, క్యాడర్‌కు భరోసా ఇచ్చేందుకు జగన్‌ తెచ్చిన అస్త్రం కాస్త..కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందట. సొంత పార్టీ నేతలపైనే కంప్లైంట్స్ వస్తున్నాయి. పైగా ఫిర్యాదు చేసినట్లు రిసిప్ట్ తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటంతో..ఎక్కడో తేడా కొడుతుంది సీనా అని చర్చించుకుంటున్నారట ఫ్యాన్ పార్టీ లీడర్లు. డిజిటల్‌ బుక్‌కు వస్తున్న ఫిర్యాదులేంటి.? ఆ బాణాలు సొంత పార్టీ నేతలపైనే ఎందుకు.?

ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి మరీ చట్టం ముందు నిలబెడతాం..

వరుస అరెస్టులు. కీలక నేతల చుట్టూ చిక్కులు. సోషల్ మీడియా పోస్టులపై కూటమి సర్కార్ ఉక్కుపాదం. ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్ ఓ అస్త్రాన్ని బయటికి తీశారు. ఫ్యాన్ పార్టీ క్యాడర్, లీడర్లకు ధైర్యం నూరి పోసేందుకు..భవిష్యత్‌పై భరోసా ఇచ్చేందుకు..రెడ్‌బుక్‌కు పోటీగా డిజిటల్‌ బుక్‌ను తెరమీదకు తెచ్చారు జగన్. డిజిటల్ బుక్‌లో నమోదైన ఫిర్యాదులపై..పవర్‌లోకి రాగానే ఏ ఒక్కరిని వదిలి పెట్టకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. ఎక్కడ దాక్కున్నా తీసుకొచ్చి మరీ చట్టం ముందు నిలబెడతామని చెప్పుకొస్తున్నారు. దీంతో ఒక రకంగా అటు రెడ్ బుక్‌, ఇటు డిజిటల్ బుక్ వ్యవహారాలు ఏపీ పాలిటిక్స్‌లో చర్చనీయాంశయ్యాయి. రాజకీయ వివాదానికి కూడా దారితీశాయి.

అటు వైసీపీ క్యాడర్..ఇటు టీడీపీ క్యాడర్‌ పోటాపోటీగా రెడ్ బుక్‌, డిజిటల్ బుక్‌లో పేర్లు నమోదు చేసుకుంటున్నామంటూ..సోషల్ మీడియా పోస్టులతో రచ్చ చేస్తున్నారు. మరోవైపు డిజిటల్ బుక్‌లో వస్తున్న ఫిర్యాదులపై వైసీపీ కూడా ఆరా తీస్తోందట. ఎక్కడెక్కడ ఏ ఆఫీసర్‌ తమ క్యాడర్‌ను ఇబ్బంది పెడుతున్నారో..ఏ పోలీస్ ఆఫీసర్ వేధిస్తున్నాడనే దానిపై డిజిటల్‌ బుక్‌ డేటాను పరిశీలిస్తున్నారట. ఈ క్రమంలో సొంత పార్టీ వైసీపీ నాయకులపైనే ఫిర్యాదులు వస్తుండటం ఫ్యాన్ పార్టీకి తలనొప్పిగా మారిందట.

అయితే లోకేశ్‌ రెడ్‌ బుక్‌ను ఆయన రాసుకున్నారు. తమ నేతలను ఇబ్బంది పెట్టిన వారిని..అడ్డగోలుగా నోరుపారేసుకున్న వారి పేర్లు నమోదు చేసుకుని..ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నట్లుగా చెప్పుకొస్తున్నారు. అయితే బుక్‌లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో..టీడీపీ సీనియర్ లీడర్లకు కూడా తెలియదు. కానీ డిజిటల్ బుక్‌ను ఓపెన్‌ బుక్‌గానే ఉంచారు జగన్. ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. వాస్తవానికి వేధింపులకు గురవుతున్న వైసీపీ క్యాడర్, లీడర్లు ఫిర్యాదు చేసేందుకు డిజిటల్ బెక్ తెచ్చామని చెప్పినప్పటికీ దీన్ని అందరూ వినియోగించుకునేలాగా ఏర్పాటు చేశారు.

ఇదే ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతోందట..

ఇదే ఇప్పుడు ఫ్యాన్ పార్టీకి ఇబ్బందులు తెచ్చి పెడుతోందట. ప్రజల నుంచి కూడా కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదులు స్వీకరించాలనుకుంటున్నారట. కానీ దీనికి భిన్నంగా వైసీపీ నాయకులపైనే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ డిజిటల్ బుక్‌లో ఇప్పటికే 32 ఫిర్యాదులు నమోదు అయ్యాయట. వైసీపీ నేతలపై అధికార పార్టీ చేస్తున్న దాడులు, దౌర్జన్యాలపై ఫిర్యాదుల కోసం డిజిటల్ బుక్ తెస్తే..తిరిగి వైసీపీ నేతలపైనే ఫిర్యాదులు వస్తుండటంతో ఫ్యాన్ పార్టీ లీడర్లు అలర్ట్ అవుతున్నారట.

సొంత పార్టీ నేతపైనే కంప్లైంట్‌ రావడంతో రచ్చ రచ్చ..

పలువురు వైసీపీ నేతల మీద ఫిర్యాదులు రావడం ఓకే. కానీ చిలకలూరిపేట వైసీపీ ఇంచార్జ్‌, మాజీ మంత్రి విడదల రజిని మీద డిజిటల్ బుక్‌ యాప్‌లో ఫిర్యాదు నమోదైందట. అధికార పార్టీ మీద అస్త్రంగా వాడాలని వైసీపీ అనుకున్న డిజిటల్ బుక్‌లో విడదల రజినిపై ఫిర్యాదు రావడం కలకలం రేపుతోంది. నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం..విడదల రజిని తన ఇల్లు, కారుపై దాడి చేయించారని ఆరోపిస్తూ, జగన్‌ న్యాయం చేయాలని కోరారు. కార్యకర్తలకు న్యాయం చేస్తామని జగన్ చెప్పిన ఈ యాప్‌లో, సొంత పార్టీ మాజీ మంత్రి రజినిపైనే కంప్లైంట్‌ రావడం చర్చకు దారితీస్తోంది. ఇలా వైసీపీ నాయకులు గతంలో చేసిన అతిని వివరిస్తూ ఫోటోలతో సహా వీడియోలతో సహా ఈ డిజిటల్ బుక్‌లో ఫిర్యాదు చేస్తున్నారట. చ‌ర్యలు తీసుకుంటారా.? అని కూడా ప్రశ్నిస్తున్నారు. దీంతో వైసీపీ పెద్దలు అవాక్కవుతున్నారట. ఏం చేయాలి? దీనిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై అంతర్మథ‌నం చెందుతున్నారు.

Also Read: లోకేశ్ వర్సెస్ కర్నాటక మంత్రులు.. మాటల యుద్ధం దేనికి.. అసలు ఈ వివాదం ఏంటి?