భవిష్యత్తులో వైసీపీ కోలుకోకుండా దెబ్బకొట్టేలా చంద్రబాబు వ్యూహం..!
భవిష్యత్‌లో మరిన్ని వలసలు ఉండే అవకాశం ఉండటమే పార్టీలో చర్చకు దారితీస్తోంది. కొత్తగా పార్టీలోకి వచ్చేవారిలో ఎవరికి బెర్త్ దొరుకుతుంది.. ఎవరెవరు వెయిటింగ్‌లో ఉండిపోవాల్సి వస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.

Gossip Garage : గ్రాండ్ విక్టరీతో హౌస్‌ఫుల్‌గా ఉంది టీడీపీ… ఎన్నికల ముందే పార్టీలో చేరిన నేతలతో కిటకిటలాడుతోంది. ఇక ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత టీడీపీపై మరింత మోజు పెరుగుతోంది. ఊహకందని విధంగా వైసీపీ నుంచి వలసలకు నేతలు క్యూ కడుతున్నారు. పార్టీలో బెర్త్‌లు ఖాళీగా లేవని చెబుతున్నా… వెయిటింగ్‌లిస్టులోనైనా తీసుకోవాలని ఎగబడుతున్నారు. మరోవైపు వైసీపీ నేతలను తీసుకోవద్దంటూ పార్టీలో కొందరు నేతలు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. దీంతో వలసలను వద్దనలేక.. పార్టీ నేతల ప్రతిపాదనలు కాదనలేకపోతోందట అధిష్టానం.. ఈ పరిస్థితుల్లో ముందుకు ఎలా వెళ్లాలనేదే అంతర్గతంగా విస్తృత చర్చకు దారితీస్తోందని చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న వారిని ఎలా సర్దుబాటు చేయాలనే ఒత్తిడి..
టీడీపీలో వలసలకు వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత చాలా మంది వైసీపీ నేతలు టీడీపీలో చేరేందుకు సంప్రదించగా, గత రెండు నెలలుగా అందరినీ వెయిటింగ్‌లో పెట్టింది టీడీపీ అధిష్టానం. ఐతే ఈ ఒత్తిడి రోజురోజుకు ఎక్కువ అవుతుండటంతో ఒకరిద్దరికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇలా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు తొలిసారి అవకాశం ఇవ్వడంతో ఇక చేరికలకు గేట్లు తెరిచినట్లైంది. మరోవైపు జిల్లాల్లో ఇప్పటికే చేరికలు ఉధృతంగా జరుగుతుండగా, ఇప్పుడు రాష్ట్రస్థాయిలో పేరున్న నేతలు కూడా క్యూ కడుతున్నారు. ఇలా పార్టీలోకి వస్తున్న వారికి భవిష్యత్‌లో ఎలాంటి అవకాశాలు ఇవ్వాల్సి వస్తుంది, ప్రస్తుతం ఉన్న వారిని ఎలా సర్దుబాటు చేయాలన్నది అధిష్టానాన్ని ఒత్తిడికి గురిచేస్తోందంటున్నారు.
వచ్చే ఎన్నికల నాటికి 50 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు?
విపక్షం నుంచి ఎమ్మెల్యే స్థాయి నేతలు క్యూ కడుతుండటంతో టీడీపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని ఆసక్తి నెలకొంది. ఇప్పటికే హౌస్‌ఫుల్ అయినా… రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయనేది ఊహించడం కష్టం కనుక ఎవరినీ కాదనలేక.. ఎస్ చెప్పలేక టీడీపీ అధిష్టానం వెయిటింగ్ లిస్టు రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి 50 కొత్త నియోజకవర్గాలు ఏర్పాటు అవుతుండటం, ఇప్పటికే ఉన్న నేతలు, కొత్తగా వస్తున్న నేతలకు సర్దుబాటు చేసే అవకాశం ఉందా? లేదా? అన్న అంశాన్ని పరిశీలిస్తోందని చెబుతున్నారు.
వలసలతో మరిన్ని ఇబ్బందులు..
వాస్తవానికి 40 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఇప్పటికే ప్రతి చోటా బహు నాయకత్వం ఉంది. ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యే స్థాయి నేతలు ఉన్నారు. నలభయ్యేళ్ల అనుభవం ఉన్న నేతలతోపాటు యువరక్తం కూడా టీడీపీకి ఎక్కువే ఉంది. ఈ రెండు తరాలను సమన్వయం చేయడమే పార్టీకి పెద్ద సమస్యగా మారగా, ఇప్పుడు కొత్తగా వలసలకు నేతలు ఎగబడుతుండటం పార్టీకి ఇబ్బందికరంగా మారిందంటున్నారు. అలా అని ఎవరినీ వద్దనే పరిస్థితి లేదని చెబుతున్నారు.
వైసీపీని నిర్వీర్యం చేయడమనే ద్విముఖ వ్యూహంతో ముందుకు..
ఎన్నికల్లో ఓటమితో వైసీపీని దెబ్బతీసింది టీడీపీ. అయితే సమీప భవిష్యత్‌లో ఫ్యాన్ పార్టీ కోలుకోకూడదంటే వలసలను ప్రోత్సహించాల్సిందేనన్నది హైకమాండ్ ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఈ పని చురుగ్గా జరుగుతోంది. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో టీడీపీలోకి వలసలు ఎక్కువయ్యాయి. వీరికి వచ్చే ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామనే హామీతోనే పార్టీలోకి తీసుకుంటున్నారు. ఐతే, కొత్తగా వచ్చే వారికి పదవులు ఇస్తే, తమ పరిస్థితి ఏంటని టీడీపీ క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కానీ, పార్టీ పటిష్టత, వైసీపీని నిర్వీర్యం చేయడమనే ద్విముఖ వ్యూహంతోనే ముందుకు కదులుతోంది టీడీపీ అధిష్టానం.
వైసీపీని ఖాళీ చేయాలనేదే లక్ష్యం..
మొత్తానికి వైసీపీ నుంచి వలసలతో టీడీపీ కిటకిటలాడుతోంది. భవిష్యత్‌లో మరిన్ని వలసలు ఉండే అవకాశం ఉండటమే పార్టీలో చర్చకు దారితీస్తోంది. గతంలో తమను వేధించిన వారిని, ఓవరాక్షన్ చేసిన వారిని పార్టీలోకి తీసుకోవద్దని కొందరు ఎమ్మెల్యేలు సూచిస్తున్నారు. దీంతో చేరికలపై ఆచితూచి అడుగులేస్తున్నా, వైసీపీని ఖాళీ చేయాలనే ఉద్దేశంతో ఎక్కువగా నేతలను తీసుకోవాలనేదే టీడీపీ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు. దీంతో కొత్తగా పార్టీలోకి వచ్చేవారిలో ఎవరికి బెర్త్ దొరుకుతుంది.. ఎవరెవరు వెయిటింగ్‌లో ఉండిపోవాల్సి వస్తుందనేది ఆసక్తికరంగా మారుతోంది.