బాలయోగి తర్వాత ఆ చాన్స్ దక్కేదెవరికి? లోక్‌సభ స్పీకర్ రేసులో తెలుగు ఎంపీలు..!
ఏపీలో బీజేపీకి మూడే స్థానాలు ఉన్నా.. కేంద్రంలో అధికారం నిలవటానికి ఏపీ ఓటర్ల తీర్పే ప్రధానమైంది. దీంతో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలని అనుకుంటే పురందేశ్వరిని స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.

Who Is Lok Sabha Speaker : లోక్ సభ స్పీకర్ చాన్స్ ఎవరికి? దివంగత నేత బాలయోగి తర్వాత స్పీకర్ అయ్యే భాగ్యం మళ్లీ తెలుగువారికి దక్కుతుందా? ఒకవేళ స్పీకర్ యోగం తెలుగు నేతలకు వస్తే… ఆ పదవిని అలంకరించబోయేది ఎవరు? తెలుగుదేశం పార్టీకి కేటాయిస్తారా? లేక తెలుగు ఎంపీల్లో వేరొకరికి అవకాశం కల్పిస్తారా? ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి స్పీకర్ పదవి ఇస్తారనే ప్రచారంలో నిజమెంత?
స్పీకర్ పదవిని టీడీపీకి కేటాయిస్తారని ప్రచారం..
లోక్‌సభ స్పీకర్ పదవి ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. కేంద్రంలో బీజేపీకి పూర్తిస్థాయిలో మెజార్టీ రాకపోవడం.. మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడటంతో స్పీకర్ ఎంపిక కీలకంగా మారింది. భవిష్యత్ రాజకీయ అవసరాల కోసం స్పీకర్ పదవిని బీజేపీ తన దగ్గరే ఉంచుకుంటుందా? లేక కూటమిలో కీలక భాగస్వామి టీడీపీకి స్పీకర్ పదవి ఇస్తుందా? అన్నది చర్చకు తావిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం కొలువుదీరిన నుంచి స్పీకర్ పదవిని టీడీపీకి కేటాయిస్తారనే ప్రచారమే ఎక్కువ జరిగింది.
పరిశీలనలో పురందేశ్వరి పేరు..
బీజేపీ తర్వాత ఎన్డీఏ కూటమిలో టీడీపీకే ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్నాయి. దీంతో టీడీపీకి స్పీకర్ పదవి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. గతంలో కూడా టీడీపీకి చెందిన దివంగత నేత జీఎంసీ బాలయోగి లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించారు. దీంతో ఈ సారి టీడీపీకి స్పీకర్ పదవి ఇస్తారనే ఊహాగానాలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేరును పరిశీలిస్తున్నారనే ప్రచారం కూడా విస్తృతంగా ఉంది.
బీజేపీ అధ్యక్షురాలిగా తన సమర్థతను చాటుకున్న పురందేశ్వరి..
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి తన సమర్థతను చాటుకున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన పురందేశ్వరి ఒకసారి కేంద్రమంత్రిగా పనిచేశారు. 2014లో బీజేపీలో చేరిన పురందేశ్వరి.. ఎన్నికల ముందు రాష్ట్ర పార్టీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుని… ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చారు. ముఖ్యంగా టీడీపీ-జనసేనతో సమన్వయం చేసుకుని మూడు ఎంపీ స్థానాల్లోనూ, 8 ఎమ్మెల్యే స్థానాల్లోనూ బీజేపీని గెలిపించడంలో సక్సెస్ అయ్యారు. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒక్కసీటు గెలుచుకోలేకపోయింది. పైగా నోటా కన్నా తక్కువ ఓట్లు తెచ్చుకుందనే అవమానాలు ఎదుర్కొంది. అలాంటి పార్టీని బలోపేతం చేసి, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే మేలు జరుగుతుందని అధిష్టానం పెద్దలకు వివరించి, ఫలితాలు రాబట్టగలిగారు పురందేశ్వరి.
అనూహ్యంగా వర్మకు కేంద్ర మంత్రి పదవి..
ఆమె వ్యూహం… ఒత్తిడి వల్లే ఏపీలో మూడు పార్టీలు కలిసికట్టుగా పోటీచేసి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దీంతో కేంద్ర మంత్రివర్గంలో పురందేశ్వరికి చోటు దక్కుతుందని అంతా ఊహించారు. కానీ, అనూహ్యంగా నరసాపురం నుంచి ఎన్నికైన భూపతిరాజు శ్రీనివాసవర్మకు కేంద్ర మంత్రి అయ్యే అవకాశం కల్పించింది బీజేపీ అధిష్టానం. ఇదే సమయంలో పురందేశ్వరిని స్పీకర్‌గా ఎంపిక చేస్తారనే ప్రచారం తెరపైకి వచ్చింది.
పురందేశ్వరిని స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశాలు..
లోక్‌సభ తొలి సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ నెల 26 బుధవారం నాడు స్పీకర్ ఎన్నిక జరగనుంది. దీంతో స్పీకర్ చాన్స్ ఎవరికి దక్కుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. దక్షిణాదిలో బలపడాలని భావిస్తున్న బీజేపీ.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఎక్కువ సంఖ్యలో ఎంపీలను గెలుచుకుంది. తెలంగాణలో 8 స్థానాల్లో విజయం సాధించడం, ఆ రాష్ట్రంలో అధికారం సాధించాలనే దిశగా ప్రయత్నాలు చేస్తుండటంతో రెండు మంత్రి పదవులను కేటాయించింది. ఇక ఏపీలో బీజేపీకి మూడే స్థానాలు ఉన్నా.. కేంద్రంలో అధికారం నిలవటానికి ఏపీ ఓటర్ల తీర్పే ప్రధానమైంది. దీంతో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యమివ్వాలని అనుకుంటే పురందేశ్వరిని స్పీకర్‌గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు.
టీడీపీ కోరితే.. ఆ పార్టీ ఎంపీకే స్పీకర్ పదవి..
ఇదే సమయంలో టీడీపీ.. స్పీకర్ కావాలని కోరితే పురందేశ్వరికి బదులుగా టీడీపీ ఎంపీకి స్పీకర్ అయ్యే చాన్స్ దక్కుతుందని అంటున్నారు. ఐతే ప్రస్తుత పరిస్థితుల్లో స్పీకర్, మంత్రి పదవులు కన్నా, కేంద్రం నుంచి ఆర్థిక సాయమే కోరుకుంటున్న సీఎం చంద్రబాబు.. పదవుల కోసం పట్టుబడే పరిస్థితి లేదంటున్నారు. దీంతో పురందేశ్వరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది.
Also Read : బొత్స కుటుంబం ఇక ఇంటికే పరిమితమా? ఘోర ఓటమికి ప్రధాన కారణం అదేనా?