లక్కీ ఛాన్స్..! మాజీ మంత్రి బొత్సకు వైఎస్ జగన్ మరో బంపరాఫర్..!

డీసీసీబీ డైరెక్టర్‌గా రాజకీయాల్లోకి వచ్చిన బొత్స... అంచెలంచెలుగా ఎదిగారు. ఒకానొక సమయంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు.

లక్కీ ఛాన్స్..! మాజీ మంత్రి బొత్సకు వైఎస్ జగన్ మరో బంపరాఫర్..!

Gossip Garage : ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిన బొత్సకు కేవలం మూడు నెలల వ్యవధిలోనే ఎమ్మెల్సీగా ఎన్నికయ్యే చాన్స్‌ వచ్చింది. ఇది ఓ రకంగా బొత్సకు గోల్డెన్‌ చాన్స్‌… ఇదే కాకుండా వైసీపీలో బొత్సకు మరో బంపరాఫర్‌ కూడా ఉందంటున్నారు. అటు కూటమి కూడా వ్యూహాత్మకంగానే పోటీ నుంచి తప్పుకుందనే మరో ప్రచారం వినిపిస్తుంది… ఇది కూడా బొత్సకు లాభదాయకమనే టాక్‌ వినిపిస్తోంది. అసలు విశాఖ రాజకీయంలో ఈ ట్విస్టులేంటి… బొత్సకు ఉన్నభారీ ఆఫర్లేంటి?

బొత్సను మించిన అదృష్టవంతులు ఎవరూ లేరు..!
వైసీపీలో మాజీ మంత్రి బొత్సకు మించిన అదృష్టవంతులు ఎవరూ లేరంటున్నారు. ఐదేళ్లు మంత్రిగా పని చేసిన బొత్స… పార్టీ ఓడిన తర్వాత…. ఎమ్మెల్సీగా చట్టసభలోకి అడుగుపెట్టే లక్కీ చాన్స్‌ దక్కించుకున్నారు. ఇప్పటివరకు ఎంపీ, ఎమ్మెల్యే పదవులను చేపట్టిన బొత్స… ఇప్పుడు ఎమ్మెల్సీగానూ పని చేసే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. పెద్దగా శ్రమ పడకుండానే ఎమ్మెల్సీ కాబోతున్న బొత్సకు అంతకు మించి అన్నట్లు మరో ఆఫర్‌ కూడా వేచిచూస్తోందని చెబుతున్నారు. ఇక అధికార పార్టీ కూడా బొత్స కోసమే వెనక్కి తగ్గిందనే టాక్‌ ఉత్తరాంధ్ర రాజకీయాలను ఊపేస్తోంది.

ఉత్తరాంధ్ర రాజకీయ ఉద్దండుడు.. పార్టీలకు అతీతంగా అభిమానులు..
ఉత్తరాంధ్ర రాజకీయ ఉద్దండుడు బొత్స. ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాల్లో మాజీ మంత్రి బొత్సకు ప్రత్యేక అనుచర వర్గం ఉంది. పార్టీలకు అతీతంగా అభిమానులు ఉన్నారు. మూడు దశాబ్దాలుగా విజయనగరం కేంద్రంగా ఆయన నిర్మించుకున్న రాజకీయ సామ్రాజ్యం…. గత ఎన్నికల్లో కూటమి హవాలో కుప్పకూలిపోయింది. ఐనా, బొత్స రాజకీయ చాణక్యాన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు. పడిలేచిన కెరటంలా…. మరింత వేగంగా దూసుకురావడం బొత్స రాజకీయం.

ఏ పార్టీలో ఉన్నా కుటుంబసభ్యులు అందరికీ టికెట్లు ఇప్పించుకోవడంలో దిట్ట..
డీసీసీబీ డైరెక్టర్‌గా రాజకీయాల్లోకి వచ్చిన బొత్స… అంచెలంచెలుగా ఎదిగారు. ఒకానొక సమయంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. అలాంటి బొత్స ఎమ్మెల్యేగా రెండు సార్లు మాత్రమే ఓడిపోయారు. ఆయన ఏ పార్టీలో ఉన్నప్పటికీ తనతోపాటు తన కుటుంబ సభ్యులకు టికెట్లు ఇప్పించుకోవడం బొత్స ఒక్కరికే సాధ్యం. కాంగ్రెస్‌లో కానీ, ఆ తర్వాత వైసీపీలో కానీ, బొత్స అడిగినన్ని టికెట్లు ఆయా పార్టీలు ఇవ్వాల్సిందే.. కాంగ్రెస్‌లో బొత్సతోపాటు ఆయన భార్య ఝాన్సీలక్ష్మి, సోదరుడు అప్పలనరసయ్య, దగ్గరి బంధువు బడ్డుకొండ అప్పలనాయుడు ఎంపీ, ఎమ్మెల్యేలుగా పనిచేశారు.

ఇక వైసీపీ హయాంలోనూ బొత్స హవా అంతకుమించి అన్నట్లు సాగింది. ఆయన మేనల్లుడు చిన్నశ్రీను విజయనగరం జడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇలా ఉత్తరాంధ్రలోనే కాదు, వైసీపీ, టీడీపీలో ఏ రాజకీయ నాయకుడి కుటుంబానికి నాలుగైదు పదవులు లేవని అంటుంటారు. ఇక ఇప్పుడు పార్టీ ఓడిన తర్వాత విశాఖ ఎమ్మెల్సీగా ఆయనకు చాన్స్‌ ఇవ్వడమే కాకుండా… మరో కీలక బాధ్యత అప్పగించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

బొత్సకు కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా జగన్‌ గట్టి వ్యూహం..
శాసనమండలిలో బొత్స పాత్రపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం మండలిలో వైసీపీకి దాదాపు 40 మంది సభ్యులు ఉన్నారు. మొత్తం సభ్యులలో నాలుగో వంతు కూడా అధికార పార్టీకి లేరు. దీంతో ప్రభుత్వాన్ని అడ్డుకోడానికి మండలిని సమర్థంగా వాడుకోవాలని భావిస్తోంది వైసీపీ. ప్రస్తుతం ఆ పార్టీ ప్లోర్‌ లీడర్‌గా గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి వ్యవహరిస్తున్నారు. బొత్సతో పోల్చుకుంటే అప్పిరెడ్డికి అనుభవం తక్కువ. పైగా బొత్స పాలిటిక్స్‌లో స్టేట్‌ ఫిగర్‌. దీంతో అప్పిరెడ్డి స్థానంలో బొత్సను వైసీపీ ఫ్లోర్‌ లీడర్‌గా చేయాలని భావిస్తోందట అధికార పార్టీ. ఇదే జరిగితే సీఎం చంద్రబాబు తర్వాత ప్రొటోకాల్‌ ప్రకారం బొత్సకు అధిక ప్రాధాన్యం దక్కుతుందంటున్నారు. బొత్సకు ఈ కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా వైసీపీ అధినేత జగన్‌ గట్టి వ్యూహమే పన్నుతున్నారంటున్నారు. ప్రతిపక్ష నేతగా బొత్సకి బాధ్యతలు అప్పగిస్తే… బీసీలకు నాయకత్వం అప్పగించామని చెప్పుకోవడమే కాకుండా… గత ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్న ఉత్తరాంధ్రలో మళ్లీ పుంజుకునే చాన్స్‌ ఉంటుందని జగన్‌ వ్యూహంగా చెబుతున్నారు.

బొత్సను లాగేసుకుని వైసీపీని దెబ్బతీయాలనేది చంద్రబాబు వ్యూహం?
ఇదే సమయంలో టీడీపీ కూడా వ్యూహాత్మకంగానే ఎమ్మెల్సీ ఎన్నికను వదిలేసిందంటున్నారు. గత ఎన్నికల్లో పూర్తిగా దెబ్బతిన్న వైసీపీకి మరింత నష్టం చేయాలంటే కొందరు ముఖ్యనేతలను టీడీపీలోకి తీసుకోవాలనే ఆలోచన చేస్తోందంటున్నారు. ఉత్తరాంధ్రలోని కీలక నేతగా ఉన్న బొత్సను టీడీపీ లేదా జనసేనలోకి తీసుకుని వైసీపీని దెబ్బతీయాలనే వ్యూహాన్ని సీఎం చంద్రబాబు సిద్ధం చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది. అందుకే పోటీకి దిగి బొత్సకు చికాకు పెట్టేకన్నా… బొత్సకు లైన్‌క్లియర్‌ చేసి.. ఆ తర్వాత కూటమిలోకి లాగేయాలనే ప్లాన్‌కు పదును పెడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల ముందు కూడా బొత్సతో టీడీపీ సంప్రదింపులు జరిపిందనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా బొత్స ద్వారా వైసీపీ ఎమ్మెల్సీలను చేర్చుకుని మండలిలోనూ ఆధిపత్యం చెలాయించాలని టీడీపీ భావిస్తోందని చెబుతున్నారు. ఈ ప్రచారంలో ఎంతవరకు నిజం ఉందో కానీ, ఎమ్మెల్సీగా శాసనమండలిలో అడుగుపెట్టక ముందే బొత్సకు భారీ ఆఫర్లు ఊరిస్తున్నాయని అంటున్నారు.

Also Read : రేషన్‌ బియ్యం అక్రమాల్లో త్వరలో అరెస్టులు..! ప్రభుత్వం హిట్ లిస్టులో ఉన్న ఆ బిగ్ వికెట్లు వీరేనా?