YS Viveka case : అవసరమైతే అవినాశ్ అరెస్ట్ తప్పదంటున్న సీబీఐ,బెయిల్ కోసం వైసీపీ ఎంపీ యత్నాలు..ఏం జరుగనుంది?!
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి బెయిల్ వస్తుందా? రాదా? అనూహ్యంగా తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావటంతో ఇక తనను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతో ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటీషన్ పై హైకోర్టు ఏం చెప్పనుంది. అవినాశ్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా సీబీఐ అరెస్ట్ చేస్తుందా?అనే ఉత్కంఠ నెలకొంది.

YS viveka case..Avinash reddy CBI
YS Viveka case : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజు ట్విస్టులు నెలకొంటున్నాయి. ఈ హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అనూహ్యంగా అరెస్ట్ చేసింది. భాస్కర్ రెడ్డికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈక్రమంలో అవినాశ్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేయటంతో ఐదోసారి కూడా (ఏప్రిల్ 17,2023) విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరు కాకుండానే సీబీఐ అరెస్ట్ చేస్తుందనే భయంతో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను కోర్టు ఈరోజు అంటే 18(2023,ఏప్రిల్)న విచారించనుంది. ముందస్తు బెయిల్ పిటీషన్ గురించి 17న సీబీఐను కీలక ప్రశ్నలు వేసింది ధర్మాసనం. అవినాశ్ ను అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించగా అవసరమైతే అరెస్ట్ చేస్తామని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు.
దీనికి అవినాశ్ తరపు లాయర్ అవినాశ్ ను ఈ కేసులో నాలుగు సార్లు విచారణకు హాజరయ్యారని ఎన్నిసార్లు విచారణకు ఆదేశించినా తన క్లైంట్ హాజరు అవుతున్నారని ఈ కేసులో ఆయనను అక్రమంగా వేధిస్తున్నారని కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీనికి వివేకా హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు చేయటంతో అవినాశ్ రెడ్డి కీలక పాత్ర వహించారని కాబట్టి ఆయనను క్షుణ్ణంగా విచారించాలని సీబీఐ కోర్టుకు స్పష్టం చేసింది. ఇటువంటి కీలక పరిణామాల మధ్య అవినాశ్ కు బెయిల్ వస్తుందా? లేదా అరెస్ట్ తప్పదా? అనే ఉత్కంఠ నెలకొంది. ఇక అరెస్ట్ తప్పదనే సంకేతాలు వినిపిస్తున్న క్రమంలో ఈరోజు హైకోర్టులో అవినాశ్ రెడ్డికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తుందా? లేదా సీబీఐ అరెస్ట్ తప్పదా? అనే ఉత్కంఠ నెలకొంది. నాలుగు ఏళ్లకు పైగా ఈ హత్యకేసు కొనసాగుతుండటంలో అనేక ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి.
Dastagiri : అవినాశ్ రెడ్డి, సీఎం జగన్ వల్ల నాకు ప్రాణ హాని : వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి
మరీ ముఖ్యంగా వివేకా హత్య కేసులో అప్రూవల్ గా మారిన వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి అత్యంత కీలక ఆరోపణలు చేస్తూ..తనకు ఎంపీ అవినాశ్ రెడ్డి, సీఎం జగన్ వల్ల ప్రాణ హాని ఉందన్నారు. తాను సునీతమ్మ దగ్గర గానీ, సీబీఐ దగ్గర గానీ 10 వేల రూపాయలు తీసుకున్నానని నిరూపిస్తే జైలు కెళ్లడానికి సిద్ధమని..అలా నిరూపించలేక పోతే మీరు పార్టీ పదవులకు రాజీనామా చేసి జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ దస్తగిరి సవాల్ చేశారు. వైఎస్ అవినాశ్ రెడ్డి పాత్ర వందకు వెయ్యి శాతం ఉంది కాబట్టే సీబీఐ ఆయన వైపుగా విచారణ కొనసాగిస్తోందని చెప్పారు. సీబీఐపై అన్యాయంగా, అక్రమంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఇప్పుడు సమస్య తమ వరకు వచ్చింది కాబట్టి అరెస్టు చేస్తారనే భయంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. సీబీఐ విచారణ చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 300 మందిని విచారణ చేశారని వెల్లడించారు. తాను తప్పు చేశాను కాబట్టే అప్రూవల్ గా మారానని తెలిపారు.
కాగా ఈ హత్య కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీ పిటీషన్ పై ఈరోజు సీబీఐ కోర్టు విచారణ చేయనుంది.