సీమలో కరువు తీరా వర్షాలు

  • Published By: chvmurthy ,Published On : September 24, 2019 / 05:29 AM IST
సీమలో కరువు తీరా వర్షాలు

Updated On : September 24, 2019 / 5:29 AM IST

వరుణుడు భయపెడుతున్నాడు.. భారీ వర్షాలతో బెంబేలెత్తిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 
 
అనంతపురం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. కళ్యాణదుర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. నీటి ప్రవాహానికి ఇళ్లు కొట్టుకుపోవడంతో ప్రజలు నిరాశ్రయులయ్యారు.  సర్వం కోల్పోయామని తామెలా బతకాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రధాన రహదారుల పై చేరిన నీరు చెరువులను తలపిస్తోంది. భారీగా నీరు రావడంతో వాహనాలు పూర్తిగా మునిగిపోతున్నాయి.  వజ్రకరూరులో ఛాయాపురంవంక వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. కళ్యాణదుర్గంలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరింది.

గుత్తిలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలోకి వరద నీరు వచ్చి చేరింది. గుత్తిలో కప్పల వర్షం కురిసింది.  నీటి ప్రవాహానికి కొండచిలువ కాలనీలోకి కొట్టుకొచ్చింది. పెద్దవడుగూరు మండలం వెంకటంపల్లిలో భారీగా వర్షం కురిసింది. వానలకు గోడకూలి ఒక విద్యార్ధిని మృతి చెందింది. సింగనమల నియోజక వర్గం యాడికి మండలంలోనూ భారీ వర్షం కురిసింది. లక్ష్మాంపల్లెలో ట్రాక్టర్‌, పలు బైక్‌లు కొట్టుకుపోయాయి. పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి.