అంతర్వేదిలో హై టెన్షన్.. ఓవైపు మంత్రులు, మరోవైపు హిందూ సంఘాలు, పోలీసులు

ఓవైపు మంత్రులు, మరోవైపు హిందూ సంఘాలు, భారీగా మోహరించిన పోలీసులు.. తూర్పుగోదావరి జిల్లాలోని సుప్రసిద్ధ అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి ఆలయం దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఆలయంలోకి దూసుకొచ్చేందుకు హిందూ సంఘాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకువచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుంటున్నారు. విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, హైందవ శక్తి, భజరంగదల్, హిందూ చైతన్య వేదిక, ధర్మ వీర్ ఆధ్యాత్మిక వేదిక తదితర సంఘాల కార్యకర్తలు ఉన్నారు.
ఇదిలా ఉంటే అగ్నికి ఆహుతైన స్వామి వారి రథాన్ని పరిశీలించేందుకు మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణు వచ్చారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు ఆలయం లోనికి వచ్చేందుకు ప్రయత్నించడంతో ఆలయం దగ్గర హైటెన్షన్ నెలకొంది.
హిందూ సంఘాలను అడ్డుకున్న పోలీసులు:
అంతకు ముందు ఆలయం వద్దకు ర్యాలీగా బయలు దేరిన హిందూ సంఘాలను పాశర్లపూడి బ్రిడ్జిపై పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతులు లేవని తిరిగి వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో హిందూ సంఘాలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. జైశ్రీరామ్ అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే అక్కడి నుంచి మెల్లగా ఆలయం వద్దకు చేరుకోగా.. పోలీసులకు తలనొప్పిగా మారింది. అటు హిందూ సంఘాలు, ఇటు లోపల మంత్రులు ఉండటంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన అందరిలోనూ ఉంది.
మంత్రులను అడ్డుకున్న హిందూ సంఘాలు:
రథం దగ్ధమైన ప్రదేశాన్ని పరిశీలించడానికి వచ్చిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి, సాంఘిక సంక్షేమ శాఖామంత్రి పినిపే విశ్వరూప్, స్థానిక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావులను అక్కడ ఉన్న ధార్మిక సంఘాలు అడ్డుకోవడంతో పరిస్థితి అదుపుతప్పింది. రథం దగ్ధమైన సంఘటనకు సంబంధించి ప్రభుత్వం చేపట్టిన విచారణ భక్తులను తప్పుదోవ పట్టించేదిగా ఉందని హిందూ ధార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
ఈ నేపథ్యంలో ఆలయం వద్దకు వచ్చిన ప్రజాప్రతినిధులకు భజరంగ్ దళ్ సభ్యులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనా ప్రదేశం దగ్గర ఏర్పాటుచేసిన బారికేడ్లను ధార్మిక సంఘాల వారు తోసుకొని ముందుకు రావడంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
చలో అంతర్వేదికి పిలుపు:
అంతర్వేది రథం దగ్ధం ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ధార్మిక సంఘాలు చలో అంతర్వేదికి పిలుపునిచ్చాయి. మలికిపురం సెంటర్ నుంచి అంతర్వేది వరకు ర్యాలీగా బయలుదేరాయి. ధార్మిక సంఘాల ఆందోళనల నేపథ్యంలో మలికిపురం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. దిండి బ్రిడ్జి వరకు వచ్చిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. మరోవైపు మంత్రులు వెల్లంపల్లి, విశ్వరూప్ లను ధార్మిక సంఘాలు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
మంటల్లో దివ్య రథం దగ్ధం:
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోని దివ్య రథం దగ్ధమైంది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. రెండో రోజైన సోమవారం(సెప్టెంబర్ 7,2020) ఆలయ ప్రాంగణంలో భక్తులతోపాటు వాహన సేవకులు, బ్రాహ్మణ సంఘాలు, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులను మోహరించారు. ఏలూరు రేంజి డీఐజీ కె.వి.మోహన్‌రావు, పోలీసు అధికారుల బృందం రథాన్ని మరోమారు పరిశీలించారు.
దర్యాప్తులో భాగంగా ఇప్పటికే మానసిక రోగిని, రథం భద్రపరిచే షెడ్డు పైభాగంలోని తేనెపట్టును తీయడానికి ప్రయత్నించే క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చన్న అనుమానంతో కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆలయ ఉద్యోగులనూ విచారించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ డైరెక్టర్ రాజేంద్ర సెసైన్ ఆధ్వర్యంలోని బృందం కాలిన రథం విడి భాగాలను సేకరించింది. దేవాదాయశాఖ ఆర్‌జేసీ భ్రమరాంబ రథాన్ని పరిశీలించి సిబ్బందిని ప్రశ్నించారు.
రథం ఎ్తతు 40 అడుగులు, 60ఏళ్ల కిందట తయారీ:
తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవ రథం అగ్నికి ఆహుతయ్యింది. శనివారం(సెప్టెంబర్ 5,2020) అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ప్రతి సంవత్సరం కల్యాణోత్సవంలో ఉత్సవమూర్తులను రథంపై ఉంచి ఊరేగిస్తారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్డులో భద్రపరుస్తారు. రాత్రి అకస్మాత్తుగా మంటలు అంటుకొని రథం దగ్ధం అయింది. అయితే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా కావాలని చేశారా అనే కోణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. 40 అడుగుల ఎత్తైన ఈ రథాన్ని 60 ఏళ్ల కిందట తయారు చేశారు.
జిల్లాలోని సఖినేటి పల్లి మండలం అంతర్వేదిలో ఉంటుందీ ఆలయం. అంతర్వేది తిరునాళ్లుగా రాష్ట్రం మొత్తం గుర్తింపు పొందింది. అంతర్వేది ఆలయం వెలుపల నిర్మించిన షెడ్‌లో స్వామివారి రథాన్ని ఉంచుతారు. ప్రతి సంవత్సరం స్వామివారి ఉత్సవాల సందర్భంగా.. ఈ రథాన్ని బయటికి తీసుకొస్తారు. ఉత్సవ మూర్తులను ఊరేగిస్తారు.
ప్రమాదమా? కుట్ర కోణమా?
ఈ ఘటన ప్రమాదవశావత్తు చోటు చేసుకుందా? లేక ఉద్దేశపూరకంగా పాల్పడ్డారా? అనేది తెలియాల్సి ఉంది. ఆరు దశాబ్దాల కిందట ఈ రథాన్ని తయారు చేశారని, ఇప్పుడిలా మంటల్లో కాలిపోవడం అపశకునం అంటూ స్థానికులు, భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమై ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రథాన్ని ఉంచే షెడ్డులో విద్యుత్ సరఫరా కోసం ఒకట్రెండు బల్బులు మాత్రమే ఉన్నాయని, షార్ట్ సర్క్యూట్ సంభవించి, రథాన్ని దహనం చేసేంత స్థాయిలో ఓల్టేజీ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.