Tadipatri : తాడిపత్రిలో మరోసారి హైటెన్షన్.. రాయలసీమ పౌరుషంపై రాజకీయ రచ్చ..
Tadipatri town : తాడిపత్రి పట్టణంలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాజకీయ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం రాజుకుంది.
JC Prabhakar Reddy, Peddareddy
High Tension in Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం (Tadipatri town) లో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాజకీయ నాయకుల సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం రాజుకుంది. రాయలసీమ పౌరుషంపై రాజకీయ రచ్చ నెలకొంది.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం సవాళ్లు, ప్రతిసవాళ్ల స్థాయికి చేరింది. రాయలసీమ పౌరుషం, సాగునీటి ప్రాజెక్టుల అంశాలపై ఇరువర్గాలు మధ్య బహిరంగ సవాళ్లు విసురుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ చేశారు.
రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై ఎక్కడైనా చర్చకు రావాలని కేతిరెడ్డి పెద్దారెడ్డి సవాల్ చేశాడు. అనంతపురం సప్తగిరి సర్కిల్, కొండారెడ్డి బురుజు, కడప కోటిరెడ్డి సర్కిల్‌లో తేల్చుకుందాం అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు. పెద్దిరెడ్డి సవాళ్లను జేసీ వర్గీయులు స్వీకరించారు. నేడు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి వద్ద అభివృద్ధిపై చర్చించేందుకు జేసీ వర్గీయులు సన్నద్ధమవుతున్నారు.
నారా లోకేశ్ జన్మదిన వేడుకల సందర్భంగా శుక్రవారం ఉదయం జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్దకు భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు తరలివచ్చారు. అక్కడి నుంచి పెద్దారెడ్డి ఇంటికి వెళ్లేందుకు వారు ప్లాన్ చేసినట్లు తెలిసింది. దీంతో శాంతిభద్రతల దృష్ట్యా అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నాయకుల ఇండ్ల వద్ద పోలీసులు భారీ గేట్లను అడ్డంపెట్టారు. తాడిపత్రిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు తాడిపత్రి పరిసర ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని పోలీసులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
