ఆ బిర్యానీ తినడం వల్లే ఈ దారుణం, వారికి హోంమంత్రి అనిత సీరియస్ వార్నింగ్

పిల్లలు అస్వస్థతకు గురైన వెంటనే ఆసుపత్రికి పంపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దాని వల్ల ఇంతటి ఘోరం జరిగిందని తెలిపారు.

ఆ బిర్యానీ తినడం వల్లే ఈ దారుణం, వారికి హోంమంత్రి అనిత సీరియస్ వార్నింగ్

Home Minister Vangalapudi Anitha (Photo Credit : Facebook)

Home Minister Vangalapudi Anitha : ఫుడ్ పాయిజన్ తో విశాఖ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న పిల్లలను ఏపీ హోంమంత్రి అనిత, ఎంపీ భరత్, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు పరామర్శించారు. 92 మంది పిల్లల ఉండగా వారిలో 82 మందికి అస్వస్థత గురయ్యారని.. ముగ్గురు చనిపోయారని, కేజీహెచ్ లో 14 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి అనిత తెలిపారు.

శనివారం పిల్లలు అస్వస్థతకు గురైన వెంటనే వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి వాళ్ళని పంపేశారని వెల్లడించారు. అందరూ చాలా చిన్న పిల్లలని, ఈ ఘటన చాలా బాధాకరం అని మంత్రి అనిత వాపోయారు. పిల్లలు అస్వస్థతకు గురైన వెంటనే ఆసుపత్రికి పంపించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దాని వల్ల ఇంతటి ఘోరం జరిగిందని, పాస్టర్ కిరణ్ పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశామని మంత్రి అనిత తెలిపారు.

ప్రభుత్వ పరంగా మృతి చెందిన పిల్లల కుటుంబాలకు 10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించామన్నారు. బయట ఫంక్షన్ నుండి తెచ్చిన ఆహారం తినడం వల్లే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని ఆమె చెప్పారు. అసలు ఫుడ్ ఎవరు పంపారు? సమోసాలు ఎవరు తెచ్చారు? అనే దానిపై విచారణ చేస్తున్నామన్నారు. మతపరమైన బోధనలు చేసి తల్లిదండ్రులను మోటివ్ చేసి ఇలాంటి చోటుకి తీసుకొస్తారని మండిపడ్డారు. ఇలాంటి హాస్టల్స్ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ ఉన్నా క్లోజ్ చెయ్యాలన్నారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న హాస్టళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో అలాంటివి రెండు ఉన్నట్లు గుర్తించామని, వెంటనే వాటిని మూసేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి అనిత చెప్పారు.

కేజీహెచ్ సూపరింటెండెంట్ శివానంద్..
”కేజీహెచ్ లో 14 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో ఒకరి పరిస్థితి తీవ్ర విషమంగా ఉంది. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 8 మంది ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. మరో 24 గంటలు పర్యవేక్షణ చేయాల్సి ఉంది”.