కన్నా కీలక వ్యాఖ్యలు : మూడు రాజధానులు చేస్తే..కేంద్రం నిధులు ఇవ్వదు

మూడు రాజధానులు, GN RAO కమిటి నివేదికపై ఏపీ రాజధాని ప్రాంతాల ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపడుతున్నారు. ఐదు రోజులుగా నిరసనలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే..రాజధాని అంశంపై అధికార, విపక్ష పార్టీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కానీ బీజేపీలో మాత్రం గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ఒకరు సపోర్టు చేస్తే..మరొకరు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019, డిసెంబర్ 22వ తేదీ ఆదివారం విజయవాడలో 10tvతో మాట్లాడారు. రాష్ట్రం మూడు రాజధానులు చేపడితే కేంద్రం నిధులు ఇవ్వదని కుండబద్ధలు కొట్టారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానిపై నిర్ణయాలు మార్చుకుంటే..కేంద్రం నిధులివ్వాలా అంటూ ప్రశ్నించారు.
సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే.కేంద్రం ఎలా సపోర్టు చేస్తుందని నిలదీశారాయన. గత ప్రభుత్వానికి ఇచ్చిన రూ. 2 వేల 500 కోట్లకు లెక్కలు చెప్పలేదని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినా..ఇప్పటికీ ఆ లెక్కలపై క్లారిటీ లేదన్నారు కన్నా. సచివాలయం విశాఖలో, మంత్రుల క్వార్టర్స్ అమరావతిలో ఉండడం పిచ్చి ఆలోచనగా అభివర్ణించారు. పాలనా వికేంద్రీకరణకు బీజేపీ వ్యతిరేకమన్నారు.
కానీ అభివృద్ధి వికేంద్రీకరణకు కాదు..మూడు రాజధానులు ఉంటే..సమయం, ప్రజాధనం రెండూ వృథానే అంటూ తెలిపారు. విశాఖ భూ కుంభకోణంపై రెండు ఉత్తరాలు రాయడం జరిగిందని, దీనిపై జగన్ ప్రభుత్వం స్పందించకపోవడంతో అనుమానాలు కలుగుతున్నాయన్నారు. రాజధాని ప్రాంత రైతులకు బీజేపీ సపోర్టుగా ఉంటుందని కన్నా లక్ష్మీనారయణ ప్రకటించారు.
Read More : AP బీజేపీలో అయోమయం : మూడు రాజధానులపై తలోమాట