Investments Flow In AP : 9 ప్రాజెక్టులు, రూ.లక్ష 82 వేల 162 కోట్ల పెట్టుబడులు.. ఏపీకి పెట్టుబడుల వెల్లువ..!
గుజరాత్ తర్వాత రెండో అతి పెద్ద రిఫైనరీ ఏపీలో ఏర్పాటు కానుందని చెప్పొచ్చు.

Investments Flow In AP : ఏపీకి భారీగా పెట్టుబడులు రానున్నాయి. రాష్ట్రంలో 2 లక్షల 63వేల 411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా లక్ష 82వేల 162 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. సచివాలయంలో జరిగిన ఎస్ఐ పీబీ సమావేశంలో ప్రాజెక్టుల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే పలు సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిపై ఎస్ఐ పీబీ సమావేశంలో చర్చించారు.
ఇక దరఖాస్తు చేసుకున్న ప్రాజెక్టుల్లో 9 కీలక ప్రాజెక్టుల స్థాపనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. ఈ 9 ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి లక్ష 82వేల 162 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతున్నాయి. అంటే దాదాపు 2 లక్షల 63వేల 411కు పైగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు.
ఇందులో ప్రధానంగా నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్.. 6 వేల ఎకరాల విస్తీర్ణంలో 96వేల 862 కోట్ల పెట్టుబడితో భారీ రిఫైనరీ ప్లాంట్ ను ఏర్పాటు చేయబోతోంది. దీని ద్వారా 2వేల 400 మంది ఉపాధి లభించబోతోంది. అలాగే విశాఖ మిలీనియం టవర్స్ లో 80 కోట్ల రూపాయల పెట్టుబడితో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు టీసీఎస్ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి ఆమోద ముద్ర వేశారు. దీని ద్వారా దాదాపు 2వేల మంది ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి.
Also Read : రేషన్ బియ్యం మాయం కేసులో పేర్నినానికి హైకోర్టులో ఊరట.. పోలీసులకు కీలక ఆదేశాలు..
పెట్టుబడిదారులంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెల ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డ్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన రాయితీలు ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక పాలసీ దేశాన్ని కూడా ఆకర్షిస్తోందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీపీసీఎల్.. ఏపీలో భారీ ఎత్తున రిఫైనరీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. రామాయపట్నం పోర్టు దగ్గర వారికి 6వేల ఎకరాల ల్యాండ్ ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. గుజరాత్ తర్వాత రెండో అతి పెద్ద రిఫైనరీ ఏపీలో ఏర్పాటు కానుందని చెప్పొచ్చు.
టాటా, రిలయన్స్ లాంటి దిగ్గజ సంస్థలు క్లీన్ ఎనర్జీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నాయి. దీని ద్వారా లక్షలాది మంది ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నిన్న ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు తీసుకున్న నిర్ణయాలతో దాదాపు 2 లక్షల 84వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించొచ్చు. ఎప్పటిలోగా ప్రాజెక్టులు పూర్తి చేస్తారు అనే వివరాలు కూడా తీసుకున్నారు.
* ఏపీకి పెట్టుబడుల వెల్లువ
* 9 ప్రాజెక్టుల ద్వారా లక్ష 82వేల 162 కోట్ల రూపాయల పెట్టుబడులు
* 2లక్షల 63వేల 411 మంది ఉద్యోగ అవకాశాలు
* నెల్లూరు జిల్లా రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ప్లాంట్
* 6వేల ఎకరాల విస్తీర్ణంలో రూ.96వేల 862 కోట్లతో 5 బ్లాకులు
* బీపీసీఎల్ ప్లాంట్ తో వచ్చే 20ఏళ్లలో 88వేల కోట్ల రూపాయల మేర ఆదాయం
* విశాఖ మిలీనియం టవర్స్ లో 80 కోట్ల రూపాయలతో టీసీఎస్ కార్యాలయం
* గ్రీన్ ఎనర్జీ పాలసీలో రూ.83వేల కోట్ల పెట్టుబడులు
* 2028 నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయ్యేలా చర్యలు
Also Read : పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ