విన్నపాలు వినవలె : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్

  • Published By: madhu ,Published On : September 23, 2020 / 08:35 AM IST
విన్నపాలు వినవలె : ఏపీ సీఎం జగన్ ఢిల్లీ టూర్

Updated On : September 23, 2020 / 10:37 AM IST

Jagan Meets Amit Shah : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌.. చాలా రోజుల తర్వాత ఢిల్లీకి వెళ్లారు. 2020, సెప్టెంబర్ 22వ తేదీ మంగళవారం సాయంత్రం ఆయన కేంద్రహోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. పలు కీలక విషయాలపై జగన్‌ అమిత్‌షాతో చర్చించారు. ఈ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్న అమిత్‌షా ఆరోగ్య పరిస్థితిని జగన్‌ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీలో పరిస్థితులపై హోంమంత్రికి నిశితంగా జగన్‌ వివరించారు.



ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుపై జగన్‌.. అమిత్‌తో చర్చించారు. అంతేకాదు.. మూడు రాజధానులు, పెండింగ్‌ నిధుల విడుదలతోపాటు..మరికొన్ని అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. అంతర్వేది ఘటన, అమరావతి భూ కుంభకోణం, ఫైబర్‌ నెట్‌ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు అంశాలను కూడా జగన్‌.. అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు.



మూడు రాజధానుల విషయంలో ఇటీవల కేంద్ర హోంశాఖ హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ల అంశంపైనా నేతలిద్దరూ చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని, పెండింగ్‌ అంశాలపై ఈ సందర్భంగా జగన్‌… అమిత్‌షాకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు.



2020, సెప్టెంబర్ 23వ తేదీ బుధవారం కేంద్ర జలశక్తిశాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌తో జగన్‌ భేటీ కానున్నారు. 9 గంటలకు ఆయనతో సమావేశం అవుతారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం, నిధుల విడుదలను జగన్‌ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు. రాష్ట్రంలో చేపట్టిన ఇతర ప్రాజెక్టులపైనా చర్చించనున్నారు.



కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ జగన్‌ భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అపాయింట్‌ కుదిరితే ప్రధాని మోదీని కూడా కలవాలని జగన్‌ భావిస్తున్నారు. అయితే ప్రధాని అపాయింట్‌మెంట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నా.. ఇప్పటి వరకు మాత్రం ఖరారు కాలేదని తెలుస్తోంది.