వెనక్కు తగ్గేదిలేదు.. ఆ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ బొమ్మ పెట్టుకుని పోటీ చేస్తా : పోతిన మహేష్

నేను లోకల్. కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం. గత ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేశానని పోతిన మహేశ్ అన్నారు.

వెనక్కు తగ్గేదిలేదు.. ఆ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ బొమ్మ పెట్టుకుని పోటీ చేస్తా : పోతిన మహేష్

Pathina Mahesh

Jana Sena Party leader Pothina Mahesh : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు నాకే ఇవ్వాలని జనసేన పార్టీ అధికార ప్రతినిది పోతిన మహేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు జనసేన కార్యకర్తలు, ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నేను లోకల్. కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం. గత ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి పనిచేశా.. నాతో పాటు పశ్చిమ నియోజకవర్గం ప్రజలు కష్టపడ్డారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో కొండ ప్రాంతాల అభివృద్ధికి పాటుపడిన పార్టీ జనసేన అని, ఈ పశ్చిమ నియోజకవర్గంలో అణువణువూ నాకు తెలుసన్నారు. జనసేన పార్టీకి తప్ప ఎవరికి ఈ సీటు ఇచ్చిన వైఎస్ఆర్ సీపీతో పోటీపడలేరని, ఇక్కడున్న వెల్లంపల్లి శ్రీనివాస్ ను వేరే నియోజకవర్గంకు పంపించింది మా పోరాటం వల్లనేనని పోతిన మహేశ్ పేర్కొన్నారు.

Also Read : MVV Satyanarayana : వైసీపీ ఎంపీ సినిమాని ఆపాలని ఎలక్షన్ కమిషన్‌కి లేఖ.. కౌంటర్ ఇచ్చిన కోన వెంకట్..

విజయవాడ పశ్చిమ అసెంబ్లీ సీటు తనకు కేటాయించకపోతే పవన్ కళ్యాణ్ బొమ్మ పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తానని పోతిన మహేష్ స్పష్టం చేశారు. గడపగడపకు పవన్ కల్యాణ్ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేస్తానని తెలిపారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీచేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఇక్కడలేరని, నాకు టికెట్ కేటాయించకుండా వేరేవాళ్లకు కేటాయిస్తే రాష్ట్రంలో మొట్టమొదట ఓడిపోయే ఉమ్మడి అభ్యర్థి విజయవాడ పశ్చిమ సీటే అవుతుందని పోతిన మహేశ్ హెచ్చరించారు.

Also Read : AP Politics : టీడీపీ, జనసేనకు షాక్ ఇచ్చిన నాయకులు.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైన కార్యకర్తలు

పోతిన మహేష్ సతీమణి మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల నుంచి తన భర్త కుటుంబాన్ని వదిలి జనసేన పార్టీకోసం అనేక పోరాటాలు చేశారని, పొత్తులో భాగంగా తన భర్తకు సీటు కేటాయించకపోవడం చాలా అన్యాయం అన్నారు. నా భర్తతో కలిసి కొండ ప్రాంతంలో ప్రజలను అనేక మందిని కలిశానని, ఎట్టి పరిస్థితుల్లో విజయవాడ పశ్చిమ సీటు మహేశ్ కే కేటాయించాలని, నా భర్తకే కేటాయిస్తారన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. పోతిన మహేష్ కుమార్తె మాట్లాడుతూ.. నా తండ్రి కుటుంబాన్ని వదిలి జనసేన పార్టీ కోసం పోరాటం చేశాడని, ఇప్పుడు సీటు ఇవ్వకుంటే ఎలా అంటూ ప్రశ్నించారు. పోరాటం చేసిన వాళ్లకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్యాయం చేయడు.. మా నాన్నకు సీటు కేటాయించే వరకు పోరాటం చేస్తామని మహేష్ కుమార్తె పేర్కొన్నారు.