టీటీడీ ఆస్తులు అమ్మే అవసరం ఏమొచ్చింది : పవన్ కళ్యాణ్

శ్రీవారి భూములు అమ్మాలన్న టీటీడీ నిర్ణయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. టీటీడీ ఆస్తులు అమ్మే అవసరం ఏమొచ్చిందో చెప్పకుండా నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. ట్విట్టర్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
తమిళనాడులోని స్వామివారి ఆస్తుల అమ్మకంపై ప్రభుత్వం, టీటీడీ బోర్డు ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పారు. టీటీడీ భూములను లీజ్ లకు ఇవ్వడం లేదా వాణిజ్య ప్రయోజనాలకు అభిృద్ధి చేయాలన్నారు. యాజమాన్య హక్కులను కోల్పోకుండా ఆదాయాన్ని సంపాదించడంపై ఎందుకు దృష్టి పెట్టరని ప్రశ్నించారు.
ఏ ప్రభుత్వానికైనా ఆదాయ వనరుల్లో భూమి ఒకటిగా ఉంటుదన్నారు. ప్రభుత్వ ఆస్తులను ముఖ్యంగా భూమిని రక్షించడానికి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నించాలని భక్తుల మనోభావాలను, నమ్మకాలను దెబ్బతీయడం సరికాదన్నారు. భవిష్యత్ లో రాష్ట్రానికి ఆర్థిక అవకాశాలను పణంగా పెట్టడం చేటు కల్గిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత పరిస్థితుల్లో టీటీడీ భూములను అనుమతిస్తే అది చాలా పెద్ద తప్పు అవుతుందని హెచ్చరించారు.
దేశంలోని ప్రతి హిందూ ధార్మిక సంస్థలు టీటీడీ వైపు చూస్తాయని దాన్ని ఆదర్శంగా తీసుకుంటాయని అలాంటి సంస్థలు ఆదర్శప్రాయంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.
ఇప్పుడు టీటీడీ భూములు అమ్మకానికి సిద్ధమైతే మిగతా సంస్థలు ఇదే బాట పడతాయని, ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని పవన్ ట్విట్టర్ లో తెలిపారు.
విభజన తర్వాత ఏపీలో ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడిందన్నారు. రాష్ట్రానికి పూర్తిస్థాయి రాజధాని లేదని, ఆర్థిక వ్యవస్థ దారుణమైన స్థితిలో ఉందని ఇలాంటి టైమ్ లో పెట్టుబడిదారులు ముందుకు వస్తేనే ఆర్థిక వ్యవస్థ బాగుపడటం, ఉద్యోగాల కల్పన జరుగడం సాధ్యమని అన్నారు. ఇలా ఇన్వెస్టర్లు రావాలంటే వారికి ప్రభుత్వం భూమి ఇవ్వాలని అదే అత్యంత ఆకర్షణీయమైన మార్గమని, భూములన్నీ అమ్ముకుంటూ పోతే పెట్టుబడిదారులు ఎలా వస్తారని పవన్ ప్రశ్నించారు.
శ్రీవారి ఆస్తులు అమ్మడం మొదలు పెట్టాక వరుసుగా రాష్ట్రంలోని ఇతర దేవాలయాల ఆస్తులను అరగంటలో అంగట్లో పెట్టేస్తారంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా అన్ని విధాలుగా ఆలోచించి స్వామి వారి ఆస్తులు అమ్మాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మంచిదన్నారు.
Read: తిరుమలపై రాజకీయాలొద్దు… వేలంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు…తేల్చిచెప్పిన చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి