Pawan Kalyan : పవన్ కల్యాణ్ వారాహి యాత్ర రెండో విడత షెడ్యూల్ ఖరారు.. ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రారంభం అంటే..
Pawan Kalyan : ఏలూరుతో పాటు దెందూలూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులను కలిసి పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు.

Pawan Kalyan
Pawan Kalyan – Varahi Yatra : జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండో విడత వారాహి విజయ యాత్రకు రెడీ అయిపోయారు. తదుపరి యాత్రకు సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 9 నుంచి పవన్ రెండో విడత వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఏలూరులో పవన్ కల్యాణ్ బహిరంగ సభ జరుగుతుంది.
ఏలూరుతో పాటు దెందూలూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులను కలిసి పవన్ కల్యాణ్ మాట్లాడనున్నారు. వారిని అడిగి స్థానిక రాజకీయ పరిస్థితులను తెలుసుకోనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో రెండో విడత వారాహి యాత్ర ప్రణాళికపై జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో పాటు పార్టీ నేతలతో సుదీర్ఘంగా చర్చించారు పవన్ కల్యాణ్.
పవన్ కల్యాణ్ ఇప్పటికే మొదటి విడత యాత్రను పూర్తి చేసుకున్నారు. గత నెల 14వ తేదీన అన్నవరంలో తొలిదశ యాత్ర ప్రారంభమైంది. దాదాపు 10 రోజుల పాటు యాత్రను పూర్తి చేశారు. ఇప్పుడు ఈ నెల 9న ఏలూరు సభతో రెండో దశ వారాహి యాత్ర ప్రారంభించాలని పవన్ నిర్ణయించారు.
తొలి విడత వారాహి యాత్రలో వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పరిపాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు పవన్ కల్యాణ్. సీఎం జగన్ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ పార్టీ నేతలు ఎవరినీ వదల్లేదు. అందరినీ తన పదునైన మాటలతో కడిగేశారు. జగన్ పాలనలో రాష్ట్రం సర్వ నాశనమైందన్నారు. ఈసారి కచ్చితంగా జగన్ ను ఇంటికి సాగనంపాలని, లేదంటే ఏపీకి భవిష్యత్తు ఉండదని ఓటర్లను హెచ్చరించారు పవన్. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించిన పవన్.. పరిపాలన అంటే ఏంటో, ఎలా ఉంటుందో తాను చూపిస్తానన్నారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే తన ఏకైక లక్ష్యమని పవన్ కల్యాణ్ పలుమార్లు తేల్చి చెప్పారు.