కాపులలో చిచ్చు పెట్టేందుకు కుట్రలు, వైసీపీ వలలో చిక్కుకోవద్దు- కాపు పెద్దలకు పవన్ కల్యాణ్ విన్నపం

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని నేను మొదలుపెట్టిన కార్యాచరణ వైసిపి నేతకు కంటగింపుగా మారింది. రాబోయే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా నిర్ణయాత్మక, క్రియాశీలక పాత్ర పోషిస్తారు.

కాపులలో చిచ్చు పెట్టేందుకు కుట్రలు, వైసీపీ వలలో చిక్కుకోవద్దు- కాపు పెద్దలకు పవన్ కల్యాణ్ విన్నపం

Pawan Kalyan Warns Kapu Leaders About YCP Conspiracy

Updated On : January 5, 2024 / 12:10 AM IST

Pawan Kalyan : జగన్ సర్కార్ పై నిప్పులు చెరిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వైసీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోందని, అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. నేను గౌరవించే కాపు పెద్దలు నన్ను దూషించినా దీవెనలుగానే స్వీకరిస్తాను అని పవన్ చెప్పారు. నన్నెంతగా దూషించినా వారికి జనసేన వాకిలి తెరిచే ఉంటుందని స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పి.. కాపులనే పావులుగా వాడుకొనే వ్యక్తిని ముందుగా ప్రశ్నించాలని పవన్ కల్యాణ్ అన్నారు. కుట్రలు, కుయుక్తులతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని కాపు పెద్దలకు విన్నపం చేశారు పవన్ కల్యాణ్.

”రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఓటమి అనివార్యమని స్పష్టంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం తాము వైసీపీని సాగనంపుతున్నామని సర్వేల ద్వారా వెల్లడిస్తూనే ఉన్నారు. అవినీతి, అస్తవ్యస్త, హింసాత్మక విధానాలతో సాగుతున్న వైసీపీ పాలనను చాలా బలంగా ఎదుర్కొంటున్న పార్టీ జనసేన. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని నేను మొదలుపెట్టిన కార్యాచరణ వైసిపి నేతకు కంటగింపుగా మారింది. రాబోయే ఎన్నికల్లో కాపులు కచ్చితంగా నిర్ణయాత్మక, క్రియాశీలక పాత్ర పోషిస్తారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించారు. కాబట్టే కాపులలో అంతర్గత విభేదాలు తీసుకువచ్చే క్రమంలోనే వైసీపీ కుట్రలకు తెర తీసింది.

Also Read : షర్మిల నిర్ణయంతో ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

కొందరు కాపు పెద్దలను జనసేనపైకి ప్రయోగిస్తోంది. జనసేనపైన, నాపైన సామాజిక మాధ్యమాల్లో విషపు రాతలు రాయించడం, అపోహలు సృష్టించే తప్పుడు వార్తలను కేవలం కాపు సామాజిక వర్గం వారి మొబైల్ ఫోన్లకు మాత్రమే పంపడం లాంటి దుశ్చర్యలకు ఒడిగడుతోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన-తెలుగు దేశం పొత్తుకి మోదీ ఆశీస్సులు ఉన్నాయి. ఆ ఆశీస్సులతోనే రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరు పక్షాలు ఒక విశ్వసనీయ పొత్తుతో అడుగులు వేస్తున్నాయి. కాపు రిజర్వేషన్ పోరాటాన్ని హింసాత్మకంగా మార్చిన మాస్టర్ క్రిమినల్ బ్రెయిన్ ఆ తర్వాత ఎటు మళ్లిందో కాపు సామాజిక వర్గం గ్రహించింది.

కాపులకు రిజర్వేషన్ ఇచ్చేది లేదు అని కాపులకు బలమైన జిల్లా అని అందరూ భావించే తూర్పుగోదావరి వెళ్ళి జగ్గంపేటలో కరాఖండీగా ప్రకటించిన జగన్ రెడ్డిని కాపు పెద్దలు ప్రశ్నించాలి. కాపు కార్పొరేషన్ కి నిధులు కేటాయింపు ఏమైందో నిలదీయాలి. సంక్షేమ పథకాల ద్వారా కాపులకు వెళ్ళే లబ్ధిని కూడా కాపు కార్పొరేషన్ లెక్కల్లో చూపించడం ఏమిటని అడగండి. కాపులను కాపు నాయకులతో తిట్టిస్తూ, తూలనాడిస్తున్న వ్యక్తిని కాకుండా నన్ను దూషించడం వల్ల ఎవరికి ప్రయోజనమో గ్రహించాలి.

Also Read : పవన్ ఫ్యాక్టర్ ను తగ్గించేందుకు వైసీపీ భారీ వ్యూహం.. ఆ ఇద్దరు నేతలపై ఫోకస్

నేను ఇంకా శాసన సభలోకి అడుగు పెట్టలేదు. నాతో పాటు ఎమ్మెల్యేలను తీసుకువెళ్లే రాజకీయ ప్రస్థానంలో ముందుకు వెళ్తున్న నాకు ముందరి కాళ్ళకు బంధాలు వేయించాలని చూస్తున్నది ఎవరో ప్రజలు గ్రహిస్తూనే ఉన్నారు. కుట్రలు, కుతంత్రాలతో అల్లిన వైసీపీ వలలో చిక్కుకోవద్దని నేను గౌరవించే కాపు పెద్దలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నన్ను దూషించే సదరు కాపు పెద్దలకు జనసేన పార్టీ వాకిలి ఎప్పుడూ తెరిచే ఉంటుందని తెలియచేస్తున్నాను. వైసీపీ ప్రాయోజిత విషపూరిత ప్రచారాలను, తప్పుడు అభిప్రాయాలతో కూడిన విశ్లేషణలు, వార్తలను విశ్వసించవద్దు” అని కాపు సామాజిక వర్గంతోపాటు ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేశారు పవన్ కల్యాణ్.