Jonnavithula Political party : ఏపీలో మరో కొత్త పార్టీ.. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల ప్రకటన..
సినీ పరిశ్రమ నుంచి మరో కొత్త రాజకీయ పార్టీ పుట్టుకు రాబోతుంది. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలకు లిరిక్స్ అందించిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు.. 'జై తెలుగు పార్టీ' పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.

Jonnavithula Ramalingeswara Rao announce new political party in AP
Jonnavithula Ramalingeswara Rao : ఆంధ్రప్రదేశ్ లో (Andhra Pradesh) ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరో కొత్త పార్టీ ఆవిర్భావం జరుగుతుంది. ఇప్పటికే ఆంధ్రాలో సినీ రంగం నుంచి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన పార్టీ పెట్టి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి మరో వ్యక్తి రాజకీయ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. టాలీవుడ్ లో పలు సూపర్ హిట్ సినిమాలకు లిరిక్స్ అందించిన జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు.. ‘జై తెలుగు పార్టీ’ పేరుతో కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర.. కాకినాడ జిల్లాలో ఏడో రోజు
తెలుగు భాషా పరిరక్షణ కోసం ఈ పార్టీ పెడుతున్నట్లు జొన్నవిత్తుల వెల్లడించారు. “తెలుగు భాషా సంస్కృతి కోసం ప్రత్యేక రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నాను. రాజకీయ నాయకులకు, ప్రజలకు సరైన అవగాహన కల్పించడం నా లక్ష్యం. వారిని చైతన్య వంతులుగా చేయడానికే ఈ రాజకీయ వేదిక. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏపీ బాగా నష్టపోయింది. భాషా, సంస్కృతి పూర్తిగా వీధిన పడిపోయాయి. వాటి విలువల కోసం రాజకీయ నాయకులు, ప్రజలు పనిచేయాలి. జై తెలుగు పేరుతో ఐదు రంగులతో పతాకాన్ని కూడా రూపొందించాను” అంటూ చెప్పుకొచ్చారు.
నీలం రంగు జలం, పచ్చ రంగు వ్యవసాయం, ఎరుపు రంగు శ్రమశక్తి, పసుపు వైభవానికి చిహ్నం, తెలుపు జల వనరులు స్వచ్ఛంగా ఉండాలి.. అనే గుర్తుగా పార్టీ పతాకాన్ని రూపొందించినట్లు వెల్లడించారు. అలాగే తెలుగు భాష కోసం.. గిడుగు రామ్మూర్తి నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు, పొట్టి శ్రీరాములు, మాజి ప్రధాని పివి నరసింహారావు, మాజీ ముఖ్యమంత్రి యన్టీఆర్ వంటి ఐదుగురు మహనీయులు కృషి చేశారని, త్యాగాలు చేశారని గుర్తుకు చేశారు. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన వారు ఎందరో ఉన్నపటికీ.. ఈ ఐదుగురు మాత్రం ముందు వరుసలో ఉంటారని, తన జై తెలుగు రాజకీయ జెండా మరియు ఎజెండాలో వీళ్ల ఫొటోలు ఉంటాయని చెప్పుకొచ్చారు.
Pawan Kalyan : మీ నమ్మకాన్ని సరైన వ్యక్తుల దగ్గర పెట్టడం లేదు- మత్స్యకారులతో పవన్ కల్యాణ్
ప్రస్తుతం మన భాషా సంస్కృతి వైభవం గురించి ఎవ్వరికీ తెలియని పరిస్థితిలో ఉందని చెప్పిన జొన్నవిత్తుల.. ఒకప్పుడు మదరాసీలు అన్నారని, ఇప్పుడు హైదరాబాదీలు అనిపించుకుంటున్నామని తెలియజేశారు. కానీ తెలుగు వాళ్లం అని మాత్రం అనిపించులేక పోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మన భాషను మనమే విస్మరించి చులకన చేసుకుంటున్నట్లు ఆరోపించారు. తెలంగాణ మొత్తం ఒక్కటే యాస ఉంటే.. ఏపీలో మాత్రం ప్రాంతాల వారీగా యాస మారిపోతుందని, ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా-గుంటూరు, నెల్లూరు, రాయలసీమ ఐదు రకాల యాసలు మనకి ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.
” మన భాషకు పునర్వైభవాన్ని తీసుకురావాలనేదే నా సంకల్పం. మన భవిష్యత్తు తరాలకు మన తెలుగు భాషను అందించాలి. లక్షల కోట్ల బడ్జెట్, అధికారం ఉన్న ప్రభుత్వాలు తెలుగు భాషకు సమున్నత స్థానం కల్పించాలి. మాతృ భాష పరిరక్షణ రాజ నాయకుల బాధ్యత. తెలుగు భాషా పరిరక్షణ ఎజెండాతో వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తాం. ఆగష్టు 15 నాటికి మా పార్టీ విధివిధానాలు ప్రకటిస్తాం. నా వెనుక తెలుగు భాష రథాన్ని లాగాలి” అంటూ ప్రజలకు తన ఆకాంక్ష తెలియజేశారు.