మదనపల్లె ఘటన : జైల్లో శివ..శివా అంటూ అరుస్తున్న పద్మజ

మదనపల్లె ఘటన : జైల్లో శివ..శివా అంటూ అరుస్తున్న పద్మజ

Updated On : January 28, 2021 / 8:57 PM IST

Madanapalle Double Murder Case : చిత్తూరు జిల్లాలోని మదనపల్లె అక్కాచెల్లెళ్ల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సబ్ జైలులో ఉన్న నిందితురాలు పద్మజ విచిత్రంగా ప్రవరిస్తోంది. శివ..శివ..అంటూ బిగ్గరగా కేకలు వేస్తుండడంతో జైలు అధికారులు కంగారు పడిపోతున్నారు. జైలు గోడలపై పిచ్చి రాతలు రాస్తోంది. ఆమెను కంట్రోల్ చే్యడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. తోటి ఖైదీలు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మానసిక ప్రవర్తనలో ఎలాంటి మార్పు రావడం లేదు. మూడు రోజుల నుంచి జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈమెను తీసుకెళ్లి పోవాలంటూ ఖైదీలు కోరుతున్నారు. 2021, జనవరి 29వ తేదీ శుక్రవారం తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకొచ్చే అవకాశం ఉందని పోలీసులు వెల్లడిస్తున్నారు.

చిత్తూరు జిల్లా మదనపల్లి డబుల్ మర్డర్ కేసు మిస్టరీగా మారింది. పునర్జన్మ విశ్వాసమే ప్రాణం తీసిందా..? లేక హత్యల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా..?… పురుషోత్తం, పద్మజకు అసలేమైంది..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సొంత బిడ్డలను కన్నవారే హత్య చేసిన ఘటనలో దర్యాప్తు చేస్తున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద కూతురు అలేఖ్య మాటలను గుడ్డిగా నమ్మిన తల్లిదండ్రులు పద్మజ, పురుషోత్తం నాయుడు… ఈ జంట హత్యలకు కారణమయ్యారని పోలీసులు భావిస్తున్నారు.

అక్కాచెల్లెళ్ల హత్య ఘటనలో కీలక అంశాలను మదనపల్లికి చెందిన మంత్రగాడు వెలుగులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘వర్క్ ఈజ్ డన్.. శివ ఈజ్ కమింగ్’’ అంటూ వారు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌లను గుర్తించగా.. పునర్జన్మలపై విశ్వాసమే దారుణ హత్యలకు కారణంగా భావిస్తున్నారు పోలీసులు. ఇంట్లో పెంపుడు కుక్కపై పురుషోత్తం నాయుడు, భార్య పద్మజల పెద్ద కూతురు అలేఖ్య పునర్జన్మ ప్రయోగాలు చేసినట్లుగా చెబుతున్నారు పోలీసులు. అక్కాచెల్లెళ్ల హత్య కేసులో మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.