అమ్మను కాలేక పోతున్నా…..మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న ఇల్లాలు

పెళ్లై 17 ఏళ్లైనా పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో ఒక ఇల్లాలు ఆత్మహత్య చేసుకున్న ఘటన విజయవాడ లోని జక్కంపూడి కాలనీలో జరిగింది. జక్కంపూడి కాలనీ బ్లాక్ నెంబర్ 92 లో నివాసం ఉండే కగ్గు తిరుపతమ్మ(32) పోతురాజు లకు 2003 లోవివాహం అయ్యింది. పోతురాజు పానిపూరి వ్యాపారం చేస్తుండగా… తిరుపతమ్మ కుమ్మరిపాలెం సెంటర్ లోని ఒక కంపెనీలో ప్యాకింగ్ సెక్షన్ లో పని చేస్తోంది.
పెళ్లైన 2 ఏళ్ల నుంచే తనకు పిల్లలు పుట్టటం లేదని తిరుపతమ్మ మనో వేదన చెందుతోంది. సంతానం కోసం వారు మొక్కని దేవుడు లేడు… వెళ్లని డాక్ట్రర్ లేడు… ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి ఫలితం లేక పోవటంతో రాను రాను నిరాశకు గురవుతూ వస్తోంది. ఇదే విషయాన్ని అనేక సందర్భాల్లో అమ్మా,నాన్నలకు, బంధువులు, స్నేహితుల దగ్గర చెప్పుకుని బాధ పడేది.
సెప్టెంబర్ 12వ తేదీ శనివారం పనికి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్తూ, పానిపూరి వ్యాపారం చేసే భర్త దగ్గరకు వెళ్ళి పలకరించి ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలు దేరింది. పోతురాజు రాత్రికి వ్యాపారం ముగించుకుని ఇంటికి చేరుకునే సరికి ఇంటి తలుపులు వేసి ఉన్నాయి.
ఎంత కొట్టినా తలుపు తీయకపోయే సరికి , చుట్టు పక్కల వారి సాయంతో తలుపులు పగల గొట్టి చూడగా….భార్య చీరతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఉంది. సమాచారం తెలుసుకున్న 2 టౌన్ పోలీసులు ఘటనా స్దలానికి వచ్చి పంచానామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు.